కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ఇక మరింత కష్టం అనిపిస్తుంది. దశాబ్దాలుగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్, ఇప్పుడు నాయకత్వ సంక్షోభంలో పడింది. దేశంలో వివిధ ప్రాంతాల్లో క్రమంగా తగ్గుతున్న పార్టీ బలం పార్టీ అధినాయకత్వాన్ని ఆందోళనలోకి నెట్టింది. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఇదే తీరులో ఇక ముందు పని చేస్తే అధికారంలోకి రావడం కష్టమేనని నాయకత్వ మార్పు తప్పదని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. పార్టీ సీనియర్లు జూనియర్లు గా రెండు వర్గాలుగా చీలిపోయింది. యువ నాయకత్వం వైపు అన్ని పార్టీలు మొగ్గుచూపుతున్నాయి. కానీ కాంగ్రెస్ లో దశాబ్దాల తరబడి పార్టీలో తిష్టవేసిన పాత నాయకుల్ని వదిలించుకునే పరిస్థితులు లేవు.
ముఖ్యంగా ఆంద్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రాల్లో పార్టీ ఉనికి నామ మాత్రంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ లాంటి ప్రాంతాల్లో విభజన అనంతరం పార్టీ ఓటు బ్యాంకు మొత్తం వైసీపీ ఖాతాలో చేరింది. ఆర్టికల్ 370 ని పునరుద్ధరణ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించడం ఆ పార్టీని దేశవ్యాప్తంగా సంక్షోభంలోకి నెట్టడం ఖాయమని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. ఏది ఏమైనా ఒక స్పష్టమైన విధానాలు లేక కాంగ్రెస్ భవిష్యత్తు ఒక ముందు మరింత దిగజారడం ఖాయమని అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
ఇప్పటికే కాంగ్రెస్ పతనం మొదలై పదేళ్లు గడిచినా.. ఆ పార్టీ దిద్దుబాటు చర్యలు తీసుకోవడం లేదు. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సైతం కుమ్ములాటలు జోరుగానే ఉన్నాయి. మహారాష్ట్ర రాజస్థాన్ లాంటి చోట్ల పార్టీ బలంగానే వున్నా నడిపించేవాళ్ళ మధ్య విభేదాలు బీజేపీకి వరంగా మారాయి. మిత్ర పక్షమైన కమ్యూనిస్టు పార్టీలు బలహీన పడటం కాంగ్రెస్ కు కోలుకోలేని దెబ్బగా మారింది. UPA లో కొన్ని కీలకమైన మిత్ర పక్షాలు కూడా ఇప్పుడు NDA వైపు చూడటంతో రాహుల్ గాంధీ నాయకత్వం పై సందేహాలు మొదలయ్యాయి. ఇక ముందు సోనియా గాంధీ తీసుకునే నిర్ణయాలపై మాత్రమే కాంగ్రెస్ భవిష్యత్ ఆధారపడి ఉంటుందని మెజారిటీ కాంగ్రెస్ నాయకులు అభిప్రాయపడుతున్నారు.