ఓ కుటుంబాన్ని ఆర్థిక సమస్యలు వెంటాడాయి. తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగాల కోసం వలస వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అక్కడ ఏదో ఒక ఉద్యోగం చేసి డబ్బు సంపాదించి తమ సమస్యలను చక్కబెట్టుకోవాలనుకున్నారు. దీంతో తమ పిల్లాడిని దగ్గరలో ఉన్న చైల్డ్ కేర్ సెంటర్లో వదిలి వెళ్లారు. సంవత్సరం తరువాత ఆ తల్లిదండ్రులు తిరిగి వచ్చి తమ పిల్లాడి కోసం చూస్తే అక్కడ పిల్లాడు లేడు. ఏమైపోయాడో మాకు తెలియదంటూ ఆ చైల్డ్ కేర్ సంస్థ వారు సమాధానమిచ్చారు. పోలీసులు, ప్రభుత్వం ఇలా ఎవరిని సంప్రదించినా ఆ పిల్లాడి ఆచూకీ తెలియలేదు.
అయితే 40 సంవత్సరాల తరువాత విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ప్రపంచాన్ని కలవరపెడుతున్న విషయమేంటంటే.. తల్లిదండ్రులు బతికుండగానే వారు చనిపోయినట్టు ఆధారాలు చూపించి, వివరాలు మొత్తం తారుమారు చేసి పిల్లలను అనాథలుగా మార్చేశారు. తర్వాత ఆ పిల్లలను దత్తతపై విదేశాలకు పంపారు. ఇలా ఒకటి రెండు కాదు ఏకంగా 2లక్షల మంది పిల్లలను దత్తత పంపినట్టు విచారణలో తేలింది. దక్షిణ కొరియాలో 1950 నుండి 1980 సంవత్సరాల మధ్య ఇలాంటి సంఘటనలు అనేకం జరిగాయట. సుమారు 2లక్షలమంది పిల్లలను ఇలా తప్పుడు ఆధారాలతో విదేశాలకు దత్తత పంపినట్టు దర్యాప్తులో తెలిసింది. ఈ విషయం బయటకు రావడంతో యావత్ ప్రపంచం నివ్వెరపోయింది.
సుమారు 400మంది వ్యక్తులు తాము ఎవరి పిల్లలమో వివరాలు కావాలని.. దీనిపై విచారణ చేయాలని పోలీసులను ఆశ్రయించారు. తమ సొంత తల్లిదండ్రులు బతికే ఉన్నా వాళ్లను చనిపోయినట్టు చూపించి ఇలా చేయడం చాలా దారుణమని పేర్కన్నారు. దక్షిణ కొరియా యుద్ధ సమయంలో సంరక్షణ కేంద్రాలకు తరలించిన పిల్లల్లో చాలా మంది పరిస్థితి ఇలానే ఉన్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా దేశాల మధ్య ఉండే శతృత్వం, వారి పంతం, ప్రభుత్వాల నిర్లక్ష్యం మొదలైనవన్నీ ఎందరో చిన్నారులను తమ తల్లిదండ్రులకు దూరం చేస్తున్నాయి.