Amazon Forest : విమాన ప్రమాదంలో తల్లి చనిపోవడంతో నలుగురు పిల్లలు అతి దట్టమైన అమెజాన్ అడవుల్లో తప్పిపోయి 40 రోజుల తర్వాత ప్రాణాలతో బయటపడ్డారు. వారి సాహసగాథ, దీనగాథ ఇప్పుడు చూద్దాం. మే ఒకటో తేదీ ఉదయం సెస్నా 206 అనే ఓ ప్యాసింజర్ విమానం అరారాకువార అనే అడవి ప్రాంతం నుండి కొలంబియా అమెజాన్ లోని
శాన్ జోస్ డెల్ గువియారే పట్టణానికి బయలుదేరింది. వాటి మధ్య దూరం 355 కిలోమీటర్లు కాగా ఆ ఎయిర్‌ప్లేన్ బయలుదేరిన కొద్దిసేపటికే ఇంజన్ లో సమస్య రావడంతో పైలట్ అలర్ట్ చేసి రిపోర్ట్ చేశాడు. కానీ కాసేపటికే విమానం సిగ్నల్ రాడార్ కు అందకపోవడంతో.. విమానం ప్రమాదానికి గురైంది. విమానం ప్రమాదాన్ని గురైందని తెలుసుకున్న సైన్యం, గాలింపు చర్యలు మొదలుపెట్టారు. కాగా మే 15,16వ తేదీల్లో దట్టమైన అమెజాన్ అడవి ప్రాంతంలో విమాన శఖలాలను సైన్యం కనిపెట్టింది. అక్కడ మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి. అందులో ఒకటి ఆ చిన్నారుల తల్లి మాగ్దలేనా(33) తో పాటూ పైలట్, ఓ తెగ నాయకుడు కన్నుమూశాడు. పిల్లలకు సంబంధించిన ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. పిల్లలు ప్రాణ రక్షణ కోసం ముందుకు వెళుతున్నారేమో అని భావించిన సైన్యంవాళ్లు బ్రతికే ఉంటారని ఆశతో ఆహార
పొట్లాలను అడవిలో వేస్తూ వాళ్ల కోసం గాలింపు చర్యలను చేపట్టారు. ఆ నలుగురు పిల్లల వయసు 13, 9, 4, 11నెలలు. అయితే ఈ నలుగురు అంత దట్టమైన అడవిలో చాలా ధైర్యంగా 40 రోజులు జీవించి ప్రపంచానికి తమ ధైర్య సాహసాలను చాటిచెప్పారు. 13 ఏళ్ల లెస్సి తన తోబుట్టువులను జాగ్రత్తగా కాపాడుకుంటూ అడవిగుండా ప్రయాణం కొనసాగించింది.
ప్రమాదాల బారిన పడకుండా ముఖ్యంగా భయంకరమైన డ్రగ్స్ ముఠా చేతికి చిక్కకుండా ఆ పిల్లలను కాపాడుతూ లెస్సి చూపిన దైర్యసాహసాలు వర్ణనాతీతం. అడవిలో దొరికిన వాటిని తింటూ, వానకు తడుస్తూ, చలికి వణుకుతూ 40 రోజులు వారు క్రూర మృగాల బారిన పడకుండా జాగ్రత్తగా తమ ప్రాణాలను కాపాడుకుంటూ వచ్చారు.
ఈనెల జూన్ 9న శుక్రవారం సాయంత్రం సైన్యం ఆ నలుగురు చిన్నారుల జాడను గుర్తించింది. ఆ నలుగురు పిల్లలు పౌష్టికాహార లోపం తప్పించి, దట్టమైన అడవిలో ఎటువంటి ఇన్ఫెక్షన్ సోకకుండా ఆరోగ్యంగా బయటపడడం ఇక్కడ గమనార్హం. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే 11 నెలల బేబీ కూడా ఎటువంటి అనారోగ్యం బారిన పడకుండా జాగ్రత్తగా బయటపడగలిగింది.