ప్రపంచంలోనే అతి పెద్ద ప్రాంతం, అతి చిన్న ప్రాంతం, అత్యధిక, అత్యల్ప జనాభా అంటూ అనేక ప్రాంతాల గురించి చదివే ఉంటారు. కానీ ఇప్పుడు 30మంది కంటే తక్కువ జనాభా నివసించే ఒక చిన్న పట్టణం గురించి తెలుసుకుందాం.. అవునూ, మీరు విన్నది కరెక్టే. మీరు ప్రయాణించడానికి కారు కూడా అవసరం లేని ప్రదేశం ప్రపంచంలో ఉందని మీకు తెలుసా? మీరు ఆ నగరాన్ని కాలినడకనతో చుట్టేయవచ్చు. ఈ ప్రదేశం చరిత్ర కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది.
ఈ పట్టణం యూరప్లోని క్రొయేషియా రాజధాని జాగ్రెబ్కు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనిని స్థానిక ప్రజలు ‘హమ్’ అనే పేరుతో పిలుస్తారు. ఈ పట్టణం చరిత్రకు సంబంధించి ఎవరి వద్ద ఖచ్చితమైన ఆధారాలు లేనప్పటికీ, ఈ పట్టణం గురించి మొదటి ప్రస్తావన 1132 సంవత్సరంలో పత్రికలలో వచ్చింది. అప్పట్లో దీని పేరు చోల్మ్ అని చెబుతారు. పురాతన కాలంలో, కొంతమంది పాలకులు పురాతన శైలిలో రాళ్లతో ఇక్కడ గోడలను నిర్మించారు.
భద్రత దృష్ట్యా, పట్టణాన్ని సులభంగా పర్యవేక్షించడానికి వీలుగా ఇక్కడ ఒక టవర్ కూడా నిర్మించారు. పలు నివేదికల ప్రకారం, ఇక్కడ జనాభా గణన 2021 సంవత్సరంలో జరిగింది. దీనిలో ఇక్కడ జనాభా దాదాపు 27 మంది అని తేలింది. అంతకుముందు, సెంట్రల్ ఇస్ట్రియా నుండి ఇక్కడ జనాభా గణన 2011 సంవత్సరంలో జరిగింది. ఆ సమయంలో ఇక్కడ జనాభా కేవలం 21 మాత్రమే.
తర్వాత 2021లో అది 27కి పెరిగింది. పట్టణంలో రెండు వీధులు మాత్రమే ఉన్నాయి. కొంతమంది సైనికులు కూడా ఇక్కడ స్థిరపడేందుకు వచ్చారని, అయితే కొన్ని కారణాల వల్ల వారు తమ కుటుంబాలను ఇక్కడ స్థిరపరచలేకపోయారని చెబుతుంటారు. ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోకపోవడంతో రెండు రోడ్లు మాత్రమే కనిపిస్తాయి. ఇక్కడ నిర్మించిన ఇళ్లు కూడా పురాతన శైలిలో కనిపిస్తాయి.