Banyan Tree : భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ బులంద్‌షహర్‌కు చెందిన మర్రిచెట్టుకు అత్యంత పురాతనమైన చరిత్ర ఉంది. ఈ మర్రిచెట్టు దాదాపు 500 సంవత్సరాల నాటిది. ఇటీవల శాస్త్రవేత్తల బృందం ఈ చెట్టు పైన పరిశోధన నిర్వహించారు. ఈ చెట్టు 500 సంవత్సరాల పురాతనమైన చెట్టుగా నిర్దారించారు.
బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా, ప్రయాగ్‌రాజ్ సెంటర్, బెబే-బోలాయి విశ్వవిద్యాలయం, రొమేనియా, దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లోని శాస్త్రవేత్తల బృందం ఈ చెట్టును కనిపెట్టారు. బులంద్‌షహర్‌లోని నరోరా జిల్లాలోని గంగా రాన్సార్‌లో ఫ్లోరిస్టిక్ సర్వేలో ఈ చెట్టు కనుగొనబడింది.
ప్రపంచంలోనే అతిపెద్ద మర్రి చెట్లల్లో పదవ స్థానంలో ఈ చెట్టు ఉందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ మర్రిచెట్టు ఊడలతో సహా 4,069 చదరపు మీటర్లలో విస్తరించి ఉంది. ఈ చెట్టు యొక్క వయసు నిర్ధారించడానికి రేడియో కార్బన్ డేటింగ్ అనే ప్రక్రియను వాడారు. దాని ద్వారా ఈ చెట్టు యొక్క వయసు 450 నుంచి 500 సంవత్సరాల వరకు ఉంటుందని నిర్ధారింపబడింది.
బులంద్‌షహర్ లోని నరోర పవర్ ప్లాంట్ కు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఈ చెట్టు ఉంది. ఈ చెట్టును కల్పవృక్షం అని కూడా పిలుస్తారు. అంటే దాని అర్థం కోరికలను తీర్చే చెట్టు అని. అక్కడి ప్రజలు దీన్ని కోరికలు తీర్చే చెట్టు అని కూడా భావిస్తారు. ఈ చెట్టు వయసు 500 సంవత్సరాలు అయినప్పటికీ ఈ చెట్టు ఇప్పటికి బలమైన స్థితిలోనే ఉంది.
రొమేనియా శాస్త్రవేత్తలు ఈ చెట్టు యొక్క ఖచ్చితమైన వయసును కనుగొన్నారు. ఈ చెట్టు ఇప్పటివరకు అనేక విపత్తులను, వ్యాధులను ఎదుర్కొంది. అయినా కూడా ఈరోజు వరకు చెక్కుచెదరకుండా అలాగే పచ్చదనంతో కళకళలాడుతుంది. ఈ చెట్టును సంరక్షించేందుకు అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నారు.