ఎంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చినట్లు హైదరాబాద్ వరదలు టిఆర్ఎస్ పార్టీ మెడకు చుట్టుకుంటున్నాయి. అల్పపీడనం ప్రభావంతో ఏర్పడిన ముసురులు టిఆర్ఎస్ పార్టీ పై నల్ల మేఘాల్లా కమ్ముకుంటున్నాయి. దైనందిన జీవితంపై కరోనా ప్రభావం వలన అష్టకష్టాలు పడుతున్న నగరజీవి పై హఠాత్తుగా కురిసిన వర్షాల పిడుగుపాటు వలన తలకిందులైన జీవితాల ప్రభావం టిఆర్ఎస్ భవితవ్యాన్ని నిర్దేశించనుంది.
ఎక్కడన్నా ప్రజాప్రతినిధులు తప్పుచేస్తే నిలదీయడం సాధారణ విషయం. కానీ ప్రజల్లో పెల్లుబుకుతున్న అసంతృప్తి ప్రజాప్రతినిధులపై దాడుల వరకు వెళ్లే స్థాయికి చేరుకుంది. తాజాగా హయత్ నగర్ డివిజన్ పరిధిలోని రంగనాయకుల గుట్ట లో వరదల వలన అవస్థలు పడుతున్న ప్రజలను పరామర్శించడానికి వెళ్ళిన టిఆర్ఎస్ కార్పొరేటర్ తిరుమల రెడ్డిపై స్థానికులు దాడి చేశారు. అతడు వేడుకుంటున్నా విడవకుండా పిడిగుద్దులు కురిపించారు. ఈ ఘటన ప్రజల్లో పెల్లుబుకుతున్న అసంతృప్తికి నిదర్శనం.
అదేవిధంగా జంటనగరాల్లో వరదల వలన దాదాపు వెయ్యికి పైగా కార్లు కొట్టుకుపోయాయి. లక్షలాది గృహాల్లో ఎన్నో గృహోపకరణాలు ఎందుకు పనికి రాకుండా పోయాయి. ఇలా జరగడానికి అధికారంలోకి వచ్చి ఆరేళ్లు అయినా నాలాలపై ఆక్రమణలను తొలగించలేని టిఆర్ఎస్ ప్రభుత్వ చేతగానితనం వలనే ఈరోజు వరద ముప్పు ఎదుర్కొంటున్నామని ప్రజలు భావిస్తున్నారు. ఈ కారణంతో ప్రత్యామ్నాయంగా టిఆర్ఎస్ వ్యతిరేక పార్టీల వైపు మొగ్గు చూపుతున్నారు.
అలా చూస్తున్న వారికి ఆశా దీపం గా కనిపిస్తున్న ఏకైక పార్టీ బిజెపి మాత్రమే. సెంట్రల్ లో అధికారంలో ఉన్న మోదీ మాత్రమే దొరకు కళ్లెం వేయగలరని మెజార్టీ ప్రజల అభిప్రాయం. అంతేకాకుండా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జంటనగరాల పరిధిలో విస్తృతంగా పర్యటిస్తూ బాధితులను పరామర్శించడం కష్టాల్లో ఉన్న ప్రజలు అంత త్వరగా మరిచిపోలేరు.
అదే సమయంలో లో బిజెపి కి కలిసివచ్చే వచ్చే అంశం ఏమిటంటే యువతలో అత్యంత ప్రజాదరణ కలిగిన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తమ వైపు ఉండడం. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల బరిలోకి దిగని జనసేన తరపున ఎన్ని ఓట్లు చీలి అధికార పార్టీకి సున్నం రాస్తుందో తెలియని పరిస్థితి.
పైగా జనసేన పార్టీ ప్రజా సమస్యలపై నిత్యం పోరాడుతూ ప్రజలకు చేరువ అవుతున్న ఈ సమయంలో గులాబీ పార్టీ పై ప్రజల్లో వ్యతిరేక భావం కలగడం బిజెపికి లాభించే అంశం. మరి బి జె పి, జనసేన కూటమి టిఆర్ఎస్ కు ఉన్న వ్యతిరేక ఓటును ఎంతవరకు తమకు అనుకూలంగా మలుచుకుంటారో అనే దానిపైన హైదరాబాద్ నవాబ్ ఎవరూ? అనే అంశం ఆధారపడి ఉంది.