ప్రజాస్వామ్య వ్యవస్థకి ఫోర్త్ ఫిల్లర్ గా భావించే మీడియా ఆంధ్రప్రదేశ్ లో కొన్ని కులాల గుప్పెట్లో పావుగా మారిందనే చెప్పాలి. ఎన్టీఆర్ ని గద్దె దింపడంలో విజయవంతంగా పని చేసిన కొందరు మీడియా సంస్థల అధినేతలు.. తర్వాత కాలంలో ప్రభుత్వాల అండతో కుబేరులుగా మారారు. మీడియాని తమకు అనుకూలంగా మార్చుకోవడంలో చంద్రబాబును మించిన పొలిటీషియన్ లేడని పొలిటికల్ సర్కిల్స్ లో అందరికీ తెలిసిన విషయమే. ప్రజల్లో బలమున్న నాయకులు కూడా ఒక వర్గం మీడియా దెబ్బకు తట్టుకోలేక విలవిల్లాడిపోయిన సంగతి ఉమ్మడి ఆంద్రప్రదేశ్లో ఉన్న ప్రతి రాజకీయ నాయకుడికి తెలుసు. ఒకప్పుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీని అభూత కల్పనలతో అవాస్తవాలతో వేధించి చివరకు కాంగ్రెస్ పార్టీలో విలీనం అయ్యేదాకా వదల్లేదు. జనసేన పరిస్థితి కూడా ఇపుడు చూస్తూనే ఉన్నాం.. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి ని కూడా ఒక రేంజ్లో ఆడుకున్న మీడియా ఆయన ఎదురుదాడితో కొంచెం వెనక్కి తగ్గింది. ఆయన స్వయంగా ఆ రెండు పత్రికలు అని సంభోదించి ప్రజల్లోకి మీడియా ద్వారా జరిగే కుట్రలను బహిరంగంగా బట్టబయలు చేసారు. సొంతంగా సాక్షి ని స్థాపించి ప్రభుత్వ పథకాలని స్వయంగా ప్రచారం చేసుకునే వరకూ వ్యవహారం వెళ్ళింది. చివరకు తన వ్యతిరేక మీడియాను మీడియా ద్వారానే ఎదుర్కొన్నారు.
ఇపుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై చంద్రబాబు ఎక్కుపెట్టిన అస్త్రంగా ఉన్న ఆంధ్రజ్యోతి ప్రత్యక్షంగా వైసీపీ ప్రభుత్వంపై తనదైన శైలిలో రెచ్చిపోతోంది. వైసీపీ బహిష్కరించిన తర్వాత కూడా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఏడిటోరియల్ పాలసీలో మార్పు లేదు. నిత్యం ప్రభుత్వం పై విమర్శలు చేసే వ్యక్తులని ఎంచుకుని గంటల కొద్దీ చర్చల ద్వారా ప్రత్యేక బులిటెన్స్ ద్వారా నిరంతరం ప్రభుత్వ విధానాలు పై దుమ్మెత్తి పోస్తోంది. అమరావతి ఉద్యమం 300 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంలో జరిగిన చర్చలో ముఖ్యమంత్రి ని బహిరంగంగా క్రిమినల్ అని దొంగ అని తన ఆస్థాన విద్వాంసుల చేత తిట్టిస్తూ చోద్యం చూస్తున్న జర్నలిస్ట్ వెంకటకృష్ణ పూర్తిగా తెలుగుదేశం కార్యకర్తలా ప్రవర్తించడంపై మీడియా సర్కిల్స్ లోనే విమర్శలు వస్తున్నాయి. హిడెన్ అజెండా దాటి ప్రత్యక్ష పోరుకు ప్రభుత్వంపై ఆంధ్రజ్యోతి పత్రిక దిగినట్లు కనిపిస్తుంది. కొన్నాళ్ళ క్రితం మీ అజెండా చంద్రబాబు అజెండా వేరు వేరు కాదని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యానించడం గమనార్హం.
సంక్షేమ పథకాలుతో ముందుకు వెళుతున్న జగన్మోహన్ రెడ్డి సర్కారుకు వ్యతిరేకంగా విమర్శలు దాటి ప్రత్యక్ష పోరుకు దిగుతున్న రాధాకృష్ణ వైఖరిలో మార్పు కోసం వైసీపీ ప్రభుత్వం ఎదురు చూస్తోంది అనుకోవడం లేదు. వ్యవస్థల్లో ఉన్న లోపాలపై ఎదురుదాడి చేసే జగన్ ఆంధ్రజ్యోతిపై కేసీఆర్ తరహా ట్రీట్మెంట్ ఇవ్వడానికే మొగ్గుచూపుతారు అనుకోవాలి. మొదట్లో T. R. S ప్రభుత్వంపై బురదచల్లిన రాధాకృష్ణ.. తర్వాత కాలంలో కేసీఆర్ దెబ్బకి కాళ్ల బేరానికి వెళ్లిన విషయం తెలిసిందే.. ఇపుడు పొరబాటున తెలుగుదేశం మరింత దిగజారడం మొదలు పెడితే.. ఆ సంస్థ ఉనికే ప్రమాదంలో పడే అవకాశం ఉందని కొందరు సీనియర్ పాత్రికేయుల అభిప్రాయం.
ఏది ఏమైనా.. మీడియా అంటే ఇపుడు అయితే భజన చేయడం లేదంటే బూరద జల్లడం అనే స్థాయికి దిగజారి పోయింది. ఎంతో ఘన చరిత్ర కలిగిన మీడియా సంస్థలు కూడా రాజకీయ పార్టీలకి, కులానికి కొమ్ముకాసి ప్రజల దృష్టిలో పలుచన కావడం, ఫేక్ సర్వేలతో విలువల్ని వదులుకోవడం అత్యంత విచారకరం అని చెప్పకతప్పదు. దిగజారుతున్న మీడియా సంస్థల వల్ల నిజమైన ప్రజాభిప్రాయం మరుగున పడే ప్రమాదం ఉంది. మీడియా వైఖరిలో మార్పు కోసం ఎదురుచుద్దాం.