పోరు నష్టం పొత్తు లాభం అనే విధానపరమైన నిర్ణయంతో కొన్నాళ్ళుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన బీజేపీ ద్వయం హల్ చల్ చేస్తున్నాయి. అందివచ్చిన అన్ని అవకాశాలని సమర్థవంతంగా ఉపయోగించుకుని ముందుకు వెళుతున్నాయి. ఉమ్మడి కార్యాచరణతో ప్రతి అంశంలో ప్రభుత్వానికి ప్రశ్నల వర్షం ఉద్యమాల పర్వం నడుపుతున్నాయి. సోము వీర్రాజు కమల దళం బాధ్యతలు చేపట్టాక బీజేపీ దూకుడుగా వైసీపీ ప్రభుత్వం పై విరుచుకుపడుతోంది. కేడర్ కూడా ఉత్సాహంగా కదలి రావడంతో దాదాపుగా అన్ని ప్రచార మాధ్యమాల్లో మళ్లీ ఆంధ్రప్రదేశ్ లో కొత్త రాజకీయ సమీకరణాలు బలం పుంజుకున్నాయా అనే చర్చ జరిగింది.
రాజధాని వికేంద్రీకరణ కి వ్యతిరేకంగా అమరావతిలో రాజధాని రైతులకు మద్దతుగా బీజేపీ జనసేన దాదాపుగా ఒకే విధానాన్ని ప్రకటించడం కూడా అందరికీ తెలిసిందే. కాకపోతే బీజేపీ దూకుడుకు ఉపయోగ పడుతున్న జనసేన క్యాడర్ సొంత పార్టీకి ఎంతవరకూ మేలు జరుగుతుంది అనే అంశం మిలియన్ డాలర్ ప్రశ్నగా మిగిలింది. బీజేపీ కి అన్ని జిల్లాల్లో చెప్పుకోదగ్గ క్యాడర్ లేదు. ఏదైనా ఆందోళనా కార్యక్రమం నిర్వహించాలి అంటే ఉమ్మడి కార్యాచరణ పేరుతో దాదాపు గా జన సైనికుల మీదే ఆధారపడాలి. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చతుర్మాస దీక్షలో ఉన్నందున, ద్వితీయ శ్రేణి నాయకత్వం జనసేన పార్టీలో చెప్పుకోదగ్గ రీతిలో లేనందున క్రెడిట్ మొత్తం కాషాయ నాయకుల ఉపన్యాసాలతో వారికే పోతోంది. బీజేపీ క్రమంగా అన్ని పార్టీల్లో ఉన్న నాయకుల్ని ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తూనే తాను సొంతంగా బలపడటానికి అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సోము వీర్రాజు తన చాకచక్యంతో చాప కింద నీరులా అన్ని జిల్లాల్లో పర్యటనలు చేస్తూ తన ధర్నాన్ని నిర్వర్తిస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ కంటే జనసేన బలమైన పార్టీ అయినప్పటికీ ప్రస్తుతానికి బీజేపీ నేతల హల్ చల్ చూస్తుంటే మేమేమీ తక్కువ కాదు అన్నట్టే ఉంది వారి ధోరణి.
ఒకవైపు బీజేపీ జాతీయ స్థాయిలో వైసీపీతో సత్సంబంధాలు నెరుపుతూ రాష్ట్రంలో జనసేన తో పొత్తు పేరుతో లౌక్యంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికీ బీజేపీ వైసీపీ మధ్య ఉన్న రహస్య అవగాహన పై టీడీపీ పలుమార్లు ఆరోపణలు చేస్తోంది. జాతీయ పార్టీలు తమ అవసరం మేరకు, ప్రభుత్వాలు నిలుపుకోవడమే పరమావధిగా అనేక నిర్ణయాలు తీసుకుంటాయి. ఎన్నికల ముందు గానీ ఎన్నికల తర్వాత గానీ వైసీపీతో బీజేపీ మిత్రత్వం నడిపితే రాష్ట్రంలో జనసేన పరిస్థితి ఏమిటని కొందరు చర్చించుకుంటున్నారు. కేంద్రంలో బీజేపీకి మళ్లీ సంపూర్ణ మెజారిటీ రాకపోతే వైసీపీ లాంటి పార్టీలను N D A లోకి ఆహ్వానించే అవకాశం ఉంది. అప్పుడు రాష్ట్రంలో పొత్తుకు బీటలు వారడం ఖాయం. ఈలోపు బీజేపీ సైద్ధాంతిక భావజాలంతో మమేకమైన జనసేన మనుగడకు ఖచ్చితంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. రాష్టవ్య్రాప్తంగా ఉన్న జనసేన క్యాడర్ బీజేపీ హస్తాల్లో చిక్కుకోవడంతో బాటు భావజాల ప్రభావంలో పడితే పార్టీకి ఉన్న లౌకిక ముద్ర పోయి ఎంతో కొంత నష్టం చేసే అవకాశం ఉంది. తమపై భారాన్ని మోపి బీజేపీ తమపై స్వారీ చేసి.. ఆనక అవకాశవాద రాజకీయాలు చేస్తే తర్వాత మేలుకొని నష్ట నివారణ చర్యలుకు ఉపక్రమించడం కంటే ఇప్పుడే ఒక స్పష్టమైన విధానంతో వెళ్ళడమే జనసేన పార్టీకి మేలు. పవన్ కళ్యాణ్ ఆ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో సమస్యలు తప్పక పోవచ్చు.