తిరుపతి పార్లమెంట్ సభ్యుడు బల్లి దుర్గాప్రసాద్ అకాల మరణంతో ఆ నియోజకవర్గ పరిధిలో ఎన్నికలు అనివార్యమయ్యాయి. తెలుగుదేశం పార్టీ ఆ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. రాయలసీమ జిల్లాల్లో ఒకప్పుడు తన హవాని కొనసాగించిన టీడీపీ ఇప్పుడు ఆత్మ రక్షణ ధోరణిలో పడ్డట్టు ప్రతిపక్ష పార్టీలు భావిస్తున్నాయి. పోటీపై వెనక్కి తగ్గడంపై కొంతమంది నాయకులు, కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గెలుపు ఓటమి పక్కన పెట్టి పోటీ చేస్తే నిస్తేజంగా ఉన్న క్యాడర్ లో ఉత్సాహం వచ్చేదని, పార్టీ ఇటువంటి నిర్ణయం తీసుకోవడం ఆత్మహత్యా సదృశం అని కొంతమంది బహిరంగంగానే తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు.
ఒక వైపు తెలుగుదేశం పార్టీకి నాయకుల వలస కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. చంద్రబాబు పై వైసీపీ నేత నందమూరి లక్ష్మీ పార్వతి వేసిన అక్రమ ఆస్తుల కేసుపై కోర్టు విధించిన స్టే ఎత్తివేయడంతో బాటు విచారణకు ఆదేశించడంతో చంద్రబాబుకు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. జిల్లాల భారీగా వైసీపీ నేతలు టీడీపీ ప్రజాబలం ఉన్న నేతల్ని నాయనా భయానా తమవైపుకు తిప్పుకొనేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తూ కొంతమేర విజయం సాధించారు. అమరావతి ఉద్యమం మినహా పార్టీ చేపట్టిన చెప్పుకోదగ్గ కార్యక్రమాలు కూడా చేపట్టలేకపోవడం కూడా ఎన్నికల్లో ప్రచారానికి అడ్డంకిగా మారింది. కానీ ఇదే అంశంలో పార్టీకి రాయలసీమ, ఉత్తరాంధ్ర నేతలకు మధ్య వైరుధ్యాలు ఉన్నాయి. భవిష్యత్తులో జరగబోయే అన్ని ఎన్నికల్లో వైసీపీ మూడు రాజధానుల అంశాన్ని ప్రధాన అస్త్రంగా వాడితే తమ ఉనికికే ప్రమాదం వచ్చే అవకాశం ఉన్నందున రెండు ప్రాంతాల నాయకులు వైసీపీ బాట పడుతున్నారు. సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు కూడా వారిని వారించలేని పరిస్థితి నెలకొంది.
రాయలసీమలో ప్రధాన పార్లమెంట్ పరిధిగా ఉన్న తిరుపతిలో పోటీ చేస్తే వైసీపీ తన అమ్ములపొదిలో ఉన్న జ్యుడీషియల్ కేపిటల్ అంశాన్ని బయటకు తీస్తుందని,తద్వారా తాము ఆత్మ రక్షణలోకి వెళ్లడం ఖాయమని, భారీ వ్యత్యాసంతో ఓటమి పాలైతే మొత్తం రాష్టవ్య్రాప్తంగా ఆ ప్రభావం పార్టీపై ఉంటుందని టీడీపీ సీనియర్లు భావిస్తున్నారు. ఎలాగూ ఓటమి తప్పనప్పుడు ఉప ఎన్నికల్లో పోటీ చెయ్యడం అనవసరం అని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అవాంచితంగా బీజేపీకి మద్దతు ఇచ్చి చేతులు దులుపుకుంటే ప్రస్తుతానికి ఇబ్బందులు ఉండవని, భవిష్యత్తులో కేడర్ ని సమీకరించుని వచ్చే ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేసి విమర్శలుకు సమాధానం చెప్పాలని టీడీపీ భావిస్తోంది
