Congress Party Plenary : ప్లీనరీ ..కాంగ్రెస్ పార్టీ కి చూపిస్తుందా ఓ కొత్తదారి?
కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు సాగిన రాహుల్ భారత్ జోడో యాత్ర కాంగ్రెస్ క్యాడర్ లో ఉత్సాహాన్ని నింపిందేమో కాని కాంగ్రెస్ నేతలను జోడించలేక పోయిందనే చెప్పాలి. చింతన్ శిబిరంలోని తీర్మానాలు చిత్తంలో ఉన్నాయో లేదా చిత్తుకాగితాలుగా మారిపోయినాయో. ఆధ్యక్షపదవి పై గాంధీల నీడపడకుండా గాంధీ కుటుంబానికి విధేయుడిని ఎన్నిక చేయించడంలో సోనియా సఫలీకృతమయ్యారు. నొప్పించక తానొవ్వక తప్పించు తిరిగే ఖర్గే ఏ మేరకు పార్టీని ప్రభావితం చేస్తారో రాయ్‌పూర్ కాంగ్రెస్ ప్లీనరీలో పార్టీ నేతలకు, కార్యకర్తలకు సరైన దిశానిర్దేశం జరుగుతుందా? నిరుద్యోగులైన యువకులు, అభాగ్యులైన దళితులు, నిస్సహాయులైన ఆదివాసీలు, గిట్టుబాటు ధర లభించని రైతులు, అధిక ధరలకు కృంగిపోతున్న మధ్యతరగతి ప్రజలను కాంగ్రెస్ సమీకరించగలుగుతుందా?
మోదీ సారథ్యంలోని బిజెపిని ఎదుర్కోగలిగిన ప్రత్యామ్నాయ శక్తిగా కాంగ్రెస్ ఎదగకపోతే 2019లో వచ్చిన ఫలితాలే పునరావృతమవుతాయనడంలో సందేహం లేదు.
రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన సందర్భంగా జరిగిన ప్లీనరీ అది అనేక మంది సీనియర్ నేతలు యువనేత ప్రసంగాన్ని ప్రశంసా దృక్కులతో తిలకించారు . పులకించారు.. 2019లో సార్వత్రక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరోసారి ఘోరంగా పరాజయం చెందింది. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 44 సీట్లు వస్తే 2019లో మరో ఎనిమిది సీట్లు మాత్రమే అధికంగా వచ్చాయి.. 2018లో ప్లీనరీకి హాజరై చప్పట్లు చరిచిన కాంగ్రెస్ నేతలు పలువురు ఆ తరువాత పార్టీ నుంచి నిష్క్రమించారు. పార్టీలో సంస్థాగత ఎన్నికలు, అధ్యక్ష ఎన్నిక పూర్తయిన నేపథ్యంలో దాదాపు అయిదేళ్ల తర్వాత 85వ కాంగ్రెస్ ప్లీనరీని ఫిబ్రవరి 24–26 తేదీల మధ్య ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో నిర్వహిస్తున్నారు..
పార్టీ కొత్త జవసత్వాలు ఏర్పర్చుకుని ప్లీనరీ తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ, వచ్చే ఏడాది జరిగే సార్వత్రక ఎన్నికల్లోను విజయం సాధించగలుగుతుందా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. రాబోయే కాలమంతా కాంగ్రెస్ పార్టీకి ఒక తీవ్ర పరీక్షా సమయం. పార్టీ మనుగడే ప్రశ్నార్ధకంగా మారిన పరిస్థితి నెలకొన్నది. 2024 వరకు జరిగే ఎన్నికల్లో బిజెపిని కాంగ్రెస్ పార్టీ దీటుగా ఎదుర్కొని చెప్పుకోదగ్గ సీట్లు సాధించకపోతే ఆ పార్టీ చరిత్ర పుటల్లో కనుమరుగయ్యే ప్రమాదం ముఖ్యంగా 2023లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే కర్ణాటక, , మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, తెలంగాణ వంటి ప్రధాన రాష్ట్రాల్లో కాంగ్రెస్ బలంగా పోరాడి తన సత్తా నిరూపించుకొనేందుకు ఈ ప్లీనరీ ప్రేరణ కలిగిస్తుందా, లేదా మొక్కుబడి ప్రసంగాలతో యాంత్రికంగా ముగుస్తుందా అన్నది గమనించవలసి ఉన్నది.
తీరొక్క రీతిలో తెలంగాణంలో అసమ్మతిరాగం, పొత్తులవాఖ్యలతో పార్టీలో హెచ్చిన చిచ్చులు ఆంధ్రపదేశ్ లో పరిస్దితి ఇప్పటికి ఆగమ్యగోచరం. జాతీయ స్దాయిలోనూ ఇదేపరిస్దితి. ఇప్పటికైనా కొత్తవారికి అవకాశమిచ్చి నిజమైన విధేయులకు విశ్వాసపాత్రులకు సముచిత స్దానమిచ్చి కోటరీ కోటను కూల్చేసి సామాన్య కార్యకర్తకి అందుబాటులో వుండాలి.హుందాగా వ్యవహరించని పార్టీకి మేలు చేయని పాత తరం నాయకులను సగౌరవంగా సాగనంపాలి. ప్రియాంక కొంతవరకు పార్టీని ప్రభావితం చేసే వ్యక్తి. అమె సేవలను చరిష్మాను ఉపయోగించుకోవాలి. రాహుల్ క్రియా శీలక పాత్రపోషిస్తూ భ్రమను వదిలి వాస్తవంలో పరిస్దితిని గ్రహించి కనీసం ప్రధాన ప్రతిపక్షం గా అవిర్భవిస్తేనే కాంగ్రెస్ మనుగడ . లేదంటే గత చరిత్ర గా మిగిలిపోతుంది
– శ్రీధర్ వాడవల్లి – హైదరాబాదు