భారత దేశ రాజకీయాల్లో ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది అనేది ప్రపంచానికి చాటి చెప్పిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది ఒక చాయ్ వాలా దేశ సింహాసనాన్ని అధిష్టించండం. ఒక వెనుకబడి వర్గాలకు చెందిన వ్యక్తి దేశంలో ఉన్న రాజకీయ ఉద్దండులని దాటి ముందుకు సాగడం. మెజారిటీ ప్రజల మనోభావాలుకు దర్పణం పట్టిన ఈ సంఘటనే నరేంద్రమోదీ ప్రధానమంత్రి కావడం. భారతీయ జనతా పార్టీకి అద్వానీ ఊపిరి ఊదితే.. వాజ్ పాయ్ నడక సాగిస్తే.. దాన్ని రాజకీయ ప్రత్యర్థులకు అందనంత దూరంలో నరేంద్రమోదీ సాగిపోతున్నారు. దేశ సర్వభౌమత్వం, సమగ్రత తన అజెండాగా చెప్పుకొనే నరేంద్రమోదీ తన మూల సిద్ధాంతాలకు భంగం కలిగితే ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని బహిరంగంగా చెబుతూనే వుంటారు.
అసలు మిగిలిన పార్టీల్లో ఉన్న నాయకత్వం చచ్చినట్టు మోదీ బాటలో ప్రయాణం చెయ్యకతప్పని పరిస్థితి ఆయన కల్పించారు. వ్యవస్థలో పేరుకుపోయిన అవినీతిని కట్టడి చెయ్యలేక, వామపక్ష పార్టీల జోక్యంతో, అవకాశవాద మిత్ర పక్షాల రాజకీయాలకు చేష్టలుడిగి చూస్తున్న మన్మోహన్ సింగ్ సర్కారుని చూసి విసిగిపోయిన దేశ ప్రజలకు నరేంద్రమోదీ రూపంలో మరో ప్రత్యామ్నాయం కనపడింది. భారతీయ జనతా పార్టీ మోడీని ప్రధానిగా ప్రకటించగానే దేశంలో లౌకికి వాదం పేరుతో చెలామణీ అవుతున్న పార్టీలు తీవ్రంగా విరుచుకుపడ్డాయి. ఆయనని హంతకుడు అని విమర్శలు గుప్పించాయి. ఆయనపై వారు చేసిన విమర్శలు సగటు భారతీయుడుపై కుహనా లౌకిక వాదులు విమర్శలుగా మోడీ తన పదునైన గళంతో తిప్పికొట్టారు. ఒక సామాన్యుడిపై రాజ సంస్థానాలు చేస్తున్న యుద్ధంగా అభివర్ణించారు. యువరాజు రాహుల్ ని మొద్దబ్బాయిగా ప్రజల ముందు నిలబెట్టారు. కాకలు తీరిన కాంగ్రెస్ యోధులని గుజరాత్ నడి వీధిలో చాయ్ వాలా మట్టి కరిపించారు.
ఆర్టికల్ 370 రద్దు, అయోధ్యలో రామాలయ నిర్మాణంలాంటి దశాబ్దాల ప్రజల కలని సాకారం చెయ్యడంలో తనదైన ముద్ర వేసుకుని ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. ఆయన సారధ్యంలో దేశంలో భారతీయ జనతా పార్టీ మరింత బలపడింది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ బీజేపీ తన ప్రాభవాన్ని మరింతగా చాటుకొనే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అది ఎంతగా అంటే ప్రపంచంలో అతిపెద్డ ప్రజాస్వామ్య దేశంలో సొంతగా, మిత్రుల సహకారం లేకుండా అధికారంలోకి వచ్చేంతగా ఎదిగిపోయింది. మోడీ ఒక దశలో భారతీయ జనతాపార్టీ కంటే ఎదిగిపోయారా అనే చర్చ పార్టీలో జరిగింది. కార్పొరేట్ వర్గాలకు మోడీ దాసోహం అయ్యారని విమర్శలు వస్తున్నా, జీడీపీ వృద్ధి రేటు పాతాళంలోకి వెళ్లిపోయిందని ప్రతిపక్ష పార్టీలు గగ్గోలు పెడుతున్నా, దేశవ్యాప్తంగా మోడీకి ఫ్యాన్ బేస్ చెక్కు చెదరలేదు. ఆయనకు ప్రచార ప్రీతి, కీర్తి కండూతి బాగా ఎక్కువే అన్న కొంతమంది వామపక్ష జర్నలిస్ట్ మిత్రుల కామెంట్స్ లో నిజం ఉండొచ్చు గాక..
జై శ్రీరామ్ అంటూ ఆయన శంఖం పూరిస్తే అవన్నీ
శంఖారావంలో కలిసి గాల్లో కొట్టుకుని పోతాయి.
భారత ప్రధానమంత్రి నరేంద్ర దామోదర్ దాస్ మోడీకి trend andhra.com పుట్టినరోజు శుభాకాంక్షలు.