దుబ్బాక ఎన్నికల్లో బిజెపి కలబడి నిలబడిందనే చెప్పాలి.
ఒకప్పుడు ఇరు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 10 శాతం ఓట్ షేర్ తో వెలిగిన బిజెపి తర్వాత కాలంలో నాయకత్వ లోపం వలన దేశమంతటా ప్రభావం చూపిస్తూ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మనుగడ కోల్పోయే పరిస్థితి వచ్చేసింది.
మారిన పరిస్థితులలో ఇరు తెలుగు రాష్ట్రాలకు బండి సంజయ్, సోము వీర్రాజు లాంటి సంఘ్ నేపథ్యం కలిగిన స్ట్రాంగ్ లీడర్స్ ని అధ్యక్షులుగా చేసిన తరువాత దూకుడుగా ముందుకు వెళుతున్న బిజెపికి మధ్యంతరంగా వచ్చిన దుబ్బాక ఎన్నికలు గేరు మార్చి రేసులో ముందుకు దూసుకెళ్లే ఊపుని అందించాయి.
ఒక శాసనసభ అభ్యర్థి ఎన్నికల నియమావళి ప్రకారం 70 లక్షల రూపాయల వరకు ఖర్చు చేయవచ్చు. కాని రఘునందన్ రావు ఇంట్లో కేవలం 18 లక్షల రూపాయలు దొరికితే వాటితో బీజేపీ పై డబ్బులు పంచుతున్నారు అనే విధమైన బురద చల్లాలని చూసిన గులాబీ పార్టీ నేతలకు, తమ కాషాయ దళంతో అవసరమైతే ఎంతటి పోరాటానికైనా సిద్ధమనే రీతిలో ఎదురు నిలిచి, నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయిలో ఢీకొట్టింది. అడుగడుగునా మీడియా సపోర్ట్ లేకపోయినా సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న పరిణామాలను ప్రజల ముందుకు తీసుకు వచ్చి , క్షేత్రస్థాయిలో ఉన్న కమిటెడ్ కార్యకర్తలను చక్కగా ఉపయోగించుకుని గులాబీ బాస్ కి చెమటలు పట్టించింది.
అసలు దుబ్బాక ఎన్నికల్లో బిజెపికి డిపాజిట్లు వస్తాయా అనే స్థాయి నుండి అర్ధరాత్రి హైటెన్షన్ డ్రామా నడిపిన అధికార పార్టీకీ దిమ్మతిరిగే షాక్ ఇవ్వబోతుందా అనే స్థాయికి చేరుకుంది.
ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ దూకుడు ముందు టిఆర్ఎస్ ఆత్మరక్షణ ధోరణి లో పడిపోయింది. అధికార పార్టీ అండతో జులుం చేస్తున్న పోలీసుల తీరుకు వ్యతిరేకంగా, బండి సంజయ్ చేపట్టిన దీక్ష ఆ పార్టీ కి ప్రజల్లో సానుభూతి తీసుకు వచ్చింది. అదే సమయంలో జరుగుతున్న పరిణామాలను చూస్తున్న ఓటర్లు అధికార పార్టీ తీరును బహిరంగంగానే విమర్శిస్తున్న పరిస్థితి దుబ్బాకలో నెలకొంది.
ఇక ఈ ఎన్నికలను గెలిపించే బాధ్యత భుజాన వేసుకున్న హరీష్ రావు పైకి మేకపోతు గాంభీర్యం తో డాంబికాలు పలుకుతున్నా, లోలోపల మాత్రం ముచ్చెమటలు పట్టిస్తున్నాయనేది మాత్రం వాస్తవం. మరి నవంబర్ 3 తారీకున ఓటరు దేవుడు ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నాడు అనేది త్వరలోనే తెలుస్తుంది.