Giliginthalu Group : సోషల్ మీడియా… సరదానే కాదు సామాజిక బాధ్యత కూడా.. : గిలిగింతలు గ్రూప్
ట్రెండ్ ఆంధ్ర : సోషల్ మీడియా లో సరదాగా ప్రారంభమైంది ఆ గ్రూప్.. పేరు కూడా అంతే సరదాగా ఉండాలి అని “గిలిగింతలు” అని దానికి పేరు పెట్టారు దాన్ని ప్రారంభించిన జగన్ మిర్యాల. “నవ్వుల పులకింతలు” అని దానికి టాగ్ లైన్. 2017 మార్చ్ 14 న ఫేస్ బుక్ లో ప్రారంభమైంది ఈ గ్రూప్.. ప్రారంభించిన వారం రోజుల్లోనే వేల సంఖ్యలో.. నెలలు గడిచే సరికే లక్ష కు చేరుకుంది దానిలో మెంబర్స్ సంఖ్య. రోజూ సరదాగా పోస్ట్లు చేయడం.. మూడు లైక్స్ ఆరు కామెంట్స్ కింద సరదా సరదాగా సాగుతూ ఉండగా.. ఒకరోజు గ్రూప్ సభ్యులు కుదిరిన వాళ్ళు అంతా కలుద్దాం అని ప్లాన్ చేసుకుని ఒక ఈవెంట్ ఏర్పాటు చేసుకున్నారు.. ఎక్కడెక్కడి వాళ్లో అంతా ఒకచోట కి వచ్చారు. సరదాగా జోక్స్.. సాంగ్స్.. డాన్స్.. సరదాగా సెలెబ్రెట్ చేసుకుంటున్నారు. రోజు గడిచిపోతుంది.. అంతా బాగానే ఉంది కానీ వాళ్లలో ఏదో వెలితి..
ఇంత మంది ఇక్కడ కలిసాం.. ఇంత డబ్బు ఖర్చు పెట్టాం.. ఇంతమంది సమయం వెచ్చించాం.. దీనికోసమేనా..? కాదు..!! మరింకేంటి..? ఈ మీటింగ్ సరదా కోసమే కాదు దీనికి ఒక సార్థకత కూడా ఉండాలి.. అదే ఎలా..? అని ఏం చేద్దామా ఆలోచిస్తున్నపుడు తలసేమియా తో బాధపడే చిన్నారులు గుర్తొచ్చారు జగన్ మిర్యాల గారికి.. అప్పటికే తన జీవితంలో జరిగిన ఒక మరచిపోలేని బాధను మిగిల్చిన సంఘటనే ఆ ఆలోచనకు కారణం గా చెప్పారు ఆయన..
పవన్ కళ్యాణ్ కి అభిమాని అయిన జగన్ తమ హీరో ప్రతి పుట్టిన రోజునాడు ఖమ్మం లో బ్లడ్ క్యాంపు ఏర్పాటు చేసేవారు. అలా ఆయన గురించి తెలుసుకున్న ఒకరి నుండి ఆయనకు ఒకరోజు ఫోన్ వచ్చింది. “తలసేమియా తో బాధపడుతున్న చిన్న పాపకు అర్జెంట్ గా బ్లడ్ కావాలి సార్.. ఏమన్నా ఎరేంజ్ చేయగలరా..?” అంటూ.. “సరే చూస్తా..” అన్న ఆయన ట్రై చేశారు గానీ ఎందుకో ఎరేంజ్ చేయలేక పోయారు. తర్వాత ఆయనకు తెలిసిన విషయం ఏంటంటే బ్లడ్ దొరక్క ఆ చిన్నారి మృతి చెందింది అని. అది విన్న ఆయనకు పట్టలేని బాధ.. బ్లడ్ కోసం ట్రై చేయడం అంటే బ్లడ్ దొరికే వరకూ ట్రై చేయడం.. ఆ పని నేను చేయలేక పోయాను. అలా చేసుంటే ఆరోజు ఆ చిన్నారి బ్రతికేది. అని ఇప్పటికీ బాధగా ఉంది అంటారు ఆయన. అప్పటి నుండి బ్లడ్ గురించి ఏ కాల్ వచ్చినా అర్ధరాత్రి అయినా సరే అది ఎరేంజ్ అయ్యాకనే నాకు మనశ్శాంతి. ఆ సంఘటనే బ్లడ్ విలువ నాకు తెలిసింది అంటారు ఆయన. అలానే తలసేమియా అనే వ్యాధి గురించి దాని వల్ల ఎందరు చిన్నారులు మృత్యువాత పడుతున్నారు అనేది తొలిసారిగా తెలుసుకున్నారు.
ఇపుడు ఇంత మంది గ్రూప్ సభ్యులు తలసేమియా వ్యాధి సోకిన పిల్లలకు బ్లడ్ డొనేట్ చేస్తే..? ఆ ఆలోచన గ్రూప్ సభ్యులతో పంచుకోగానే అందరూ సంతోషంగా ఒప్పుకుని తొలిసారి గ్రూప్ నుండి తలసేమియా పిల్లల కోసం బ్లడ్ డోనేట్ చేశారు. అప్పటి నుండీ ప్రతి ఆరునెలలకి ఒకసారి గ్రూప్ తరపున ప్రతి సంవత్సరం బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నారు. అలానే ఈ నెల 26 వ తారీఖు న కూడా ఖమ్మం లో బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేసి దాదాపు 250 మంది రక్త దానం చేశారు. అంతే కాదు లాస్ట్ టైం కరోనా సమయం లో కూడా గ్రూప్ ని ఉపయోగించుకుని ఎందరికో ప్లాస్మా అందే ఏర్పాటు చేశారు. అలానే గ్రూప్ ద్వారా వివిధ సేవా కార్యక్రమాలు చేస్తూ.. సోషల్ మీడియా అంటే సరదానే కాదు దానితో పాటు సామాజిక బాధ్యత కూడా అని చాటి చెబుతున్నారు గిలిగింతలు గ్రూప్ సభ్యులు. ట్రెండ్ ఆంధ్ర తరపున ఈ గ్రూప్ సభ్యులు అందరికీ అలానే జగన్ గారికి మా ప్రత్యేక అభినందనలు తెలియ చేస్తున్నాము..