ప్రతిష్టాత్మకంగా జరుగనున్న హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపు కోసం తెలంగాణ రాష్ట్ర సమితి వేగంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి తనయుడు కేటీఆర్ ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకునేలా పావులు కదుపుతున్నారు. పార్టీ అధికారంలో ఉండటంతో ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీలని కట్టడి చెయ్యడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ కొన్ని చోట్ల పుంజుకుని ఉంటే మరికొన్ని చోట్ల కాంగ్రెసు కూడా బలమైన అభ్యర్థులని రంగంలో దింపింది. తెలంగాణా వ్యాప్తంగా ఉన్న వివిధ సంఘాలు ఇప్పటికే గులాబీ దళానికి మద్దతు ప్రకటించాయి. ఏది ఏమైనా గ్రేటర్ పరిధిలో ప్రత్యర్థులని అతి తక్కువగా సంఖ్యకే పరిమితం చెయ్యాలని గులాబీ బాస్ కేసీఆర్ శ్రేణులకి దిశానిర్దేశం చేశారు.
జరగబోయే జీ హెచ్ ఎమ్ సీ మరియ పట్టభద్రుల ఎన్నికల్లో 32 కాపు సంఘాలు తెలంగాణ రాష్ట్ర సమితి కి తమ మద్దతు ప్రకటించాయి. మంత్రి దానం నాగేందర్ సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వివిధ జిల్లాల కాపు నాయకులు హాజరయ్యారు. వారు ప్రభుత్వం ముందు కొన్ని ప్రతిపాదనలు పెట్టారు. వాటిలో ముఖ్యంగా రాష్టవ్య్రాప్తంగా ఉన్న కాపులని బీసీల్లో చేర్చాలని, కాపులకు పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని, కాపులకు హైదరాబాద్ కేంద్రంగా కాపు భవనం నిమిత్తం ఐదు ఎకరాల స్థలం కేటాయించాని విజ్ఞప్తి చేసారు. ప్రతి నియోజకవర్గంలో దాదాపుగా ఇరవై వేల మంది కాపులు ఉన్నారని వారి సంక్షేమం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలని విజ్ఞప్తి చేసారు. చర్చల అనంతరం దానం నాగేందర్ మాట్లాడుతూ సంఘ నాయకుల సూచనలు కేసీఆర్ దృష్టికి తీసుకుని వెళతానని చెప్పారు. సంతృప్తి చెందిన కాపు సంఘ జే ఏ సి కన్వీనర్ కే ఎస్ ఎన్ మూర్తి తెలంగాణ రాష్ట్ర సమితి కి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
ఇదిలా ఉండగా బీజేపీ జనసేన పొత్తులో భాగంగా హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేస్తున్నాయి. కాపు సామాజిక వర్గంలో పట్టున్న జనసేన పార్టీకి ఈ నిర్ణయం శరాఘాతం అని చెప్పక తప్పదు. ఈ నిర్ణయంతో బీజేపీకి కూడా ఓటు బ్యాంకు తగ్గటం జరుగుతుందని రాజకీయ విశ్లేషకుల అంచనా. తెలంగాణలో ఎలాగైనా పట్టు సంపాదించాలని ఉవ్విళ్లూరుతున్న కమలదళం అధికార తెలంగాణ రాష్ట్ర సమితి చేతిలో మరోసారి పరాభవం పాలయ్యే అవకాశం కనిపిస్తోంది.
తెలంగాణ వ్యాప్తంగా యాక్టివ్ గా ఉన్న కార్మిక సంఘాలు కులసంఘాలు గులాబీ గూటికి చేరడంతో ఇక జరగబోయే ఎన్నికల్లో తమ గెలుపు నల్లేరు మీద
మీద నడకే అని అధికార పార్టీ నాయకులు ధీమాగా వున్నారు.
