Guntur Kaaram : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ గుంటూరు కారం. ఆది నుంచి ఈ మూవీకి అన్నీ ఆటంకాలే ఎదురవుతున్నాయి. ఎన్నో వాయిదాల అనంతరం జనవరిలో ఈ మూవీ సారధి స్టూడియోలో భారీ సెట్ లో రెండు షెడ్యూల్స్ ని కంప్లీట్ చేసుకుంది. ఇప్పటికీ ఈ మూవీ షూట్ 10, 20% శాతం మాత్రమే పూర్తవగా అందులో నుంచే ఏరికోరి మొన్న మే 31న గ్లిమ్స్ వదిలారు మేకర్స్.
అయితే మొదట ఈ మూవీని ఆగస్ట్ లో రిలీజ్ చేయాలి అనుకున్నారు అందుకు తగ్గట్టే షూటింగ్ లో వేగం పెంచారు. కానీ అంతలోనే ఏం జరిగిందో ఏమో వచ్చే ఏడాది సంక్రాంతికి 13న విడుదల చేస్తామని ప్రకటించారు. దీంతో అంతా రిలాక్స్ అయిపోయారు. పనిలో పనిగా హీరో రెండు ఫారెన్ ట్రిప్పులు కూడా వేసొచ్చాడు. అయితే ఇక్కడే అసలు సమస్య స్టార్ట్ అయ్యింది. త్రివిక్రమ్ మూవీ అంటేనే అనేకమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉంటారన్న విషయం తెలిసిందే.

అలాగే గుంటూరు కారంలో కూడా పూజ హెగ్డే, శ్రీలీల, ప్రకాష్ రాజ్, జగపతిబాబు లాంటి స్టార్ క్యాస్టింగ్ ఉంది. అయితే వీళ్లంతా మొదట అనుకున్న ఆగస్ట్ రిలీజ్ డేట్ కే డేట్స్ ఇచ్చారు. 3 నెలల సుదీర్ఘ విరామం అనంతరం ఇప్పుడు షూట్ స్టార్ట్ చేయడానికి వీళ్ళందరి డేట్స్ ఒకేసారి అడ్జస్ట్ చేయడం మూవీ టీంకు కష్టంగా మారింది. అయితే లేటెస్ట్ షెడ్యూల్ ప్రకారం.. జూన్ మొదటివారం నుంచి షూట్ స్టార్ట్ అవ్వాలి కానీ దాన్ని జూన్ 12కి మార్చారు. తాజా సమాచారం ప్రకారం జూన్ 12న జరగాల్సిన షూట్ కూడా వాయిదా పడిందంట.
ఈ మూవీలో విలన్ గా కీలక పాత్రలో నటిస్తున్న జగపతిబాబు మరో భారీ చిత్రానికి వెళ్లినట్టు తెలుస్తుంది. ఇదంతా ఓకెత్తైతే.. ఈ మూవీకి కమిట్ అయినా రోజువారీ వేతనాలు తీసుకునే చిన్నచిన్న ఆర్టిస్టుల సంగతీ మరీ ఘోరం. ప్రతీసారి ఈ సినిమాకు షూటింగ్ కి డేట్స్ తీసుకోవడం, చివరకు క్యాన్సల్ చేయడం. దీంతో వారు ఇతర చిత్రాలను కూడా కోల్పోయి ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకరకంగా గుంటూరు కారం దెబ్బకి మండిపోతున్నారు అని చెప్పొచ్చు.

వీటికి తోడు ప్రొడక్షన్ హౌస్, త్రివిక్రమ్, మహేష్ బాబుకి మధ్య ఏం జరిగిందో ఏంటో అర్థం కాక.. ఆ మధ్య ఈ మూవీ ఆగిపోయింది అంటూ కథనాలు కూడా వచ్చాయి. చివరకు ప్రొడ్యూసర్ నాగవంశీ ట్విట్టర్ వేదికగా స్పందించక తప్పలేదు. చివరకు ఈ మూవీ టీం అందరి డేట్స్ సంపాదించి నెక్స్ట్ షెడ్యూల్ ఎప్పుడు ప్లాన్ చేస్తారో ఏమో.. ఎలాగూ ఒకటి రెండు నెలల్లో బాబుగారు మళ్లీ ఫారెన్ ట్రిప్ కు వెళ్తాడాయే..! ఇన్నీ సమస్యల నడుమ గుంటూరు కారం సంక్రాంతికి రావడం కూడా కష్టమే.. చూడాలి గురూజీ ఏం మాయ చేస్తాడో..!
