హైదరాబాదీయులు ఎంతగానో ఎదురుచూస్తోన్న నుమాయిష్ ఎగ్జిబిషన్‌కు వేళైంది. గత మూడేళ్లుగా ప్రమాదాలు, కరోనా కారణంగా ఏర్పడిన అవాంతరాలతో నుమాయిష్ ప్రదర్శనను పూర్తిగా ఆస్వాదించలేని నగరవాసులు.. ఈసారి నిర్వహించే ఎగ్జిబిషన్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే.. 2023 జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు 45 రోజుల పాటు నిర్వహించనున్న నుమాయిష్ ప్రదర్శనకు ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
ఈ ఏడాది కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్నిరకాల ఉత్పత్తులతో కూడిన స్టాల్స్ అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. సుమారు 2400 స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఎగ్జిబిషన్ ప్రదర్శనకు వచ్చే సందర్శకులకు ఉచిత పార్కింగ్, వైద్య శిబిరం ఏర్పాటు చేయడంతో పాటు కోవిడ్ భద్రతా ఏర్పాట్లను నిర్వాహకులు పేర్కొన్నారు. ఇక ఎంట్రీ ఫీజు విషయానికొస్తే పెద్దలకు రూ. 40గా నిర్ణయించారు. 5 ఏళ్ల లోపు పిల్లలకు ఎంట్రీ ఫీజును మినహాయించారు.

నుమాయిష్‌ను హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్‌రెడ్డిలు ప్రారంభించనున్నారు. పిల్లలు, పెద్దల కోసం ప్రత్యేకగా అమ్యూజ్‌మెంట్ పార్కును సిద్ధం చేశారు. ఈ ఏడాది నుమాయిష్‌కు జనాలు భారీగా వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మధ్యాహ్నం 3.30 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు ఎగ్జిబిషన్ ఉంటుంది.
స్థానికంగా తయారయ్యే ఉత్పత్తులకు ప్రచారం, ప్రోత్సాహం అందించాలన్న ఉద్దేశంతో 1938లో నుమాయిష్ ప్రారంభమైంది. అప్పటి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఈ పారిశ్రామిక ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. మొదట్లో 50 స్టాళ్లతో ప్రారంభమైన నుమాయిష్ ఇప్పుడు 2 వేలకు పైగా స్టాళ్లతో దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రదర్శనగా గుర్తింపు తెచ్చుకుంది. హైదరాబాదులో నిర్వహించే నుమాయిష్ ను ఏటా 45 వేలమంది సందర్శిస్తారని అంచనా.
