Inspirational story about Mountain Man : ఒక మనిషి ఏదైనా సాధించాలంటే దానికి పట్టుదల ఉంటే సరిపోతుంది. కొండల్ని కూడా పిండి చేయొచ్చు. ఏదైనా అనుకున్నప్పుడు దాన్ని సాధించేంతవరకు ఆ కార్యరూపం దాల్చేంత వరకు వదిలిపెట్టకుండా కార్యసాధన చేస్తే తప్పకుండా విజయం మీ సొంతం అవుతుంది. దానికి నిదర్శనం దశరథ్ అనే వ్యక్తి.
దశరథ్ మంజ ఈయన ఏకంగా పర్వతాన్నే పిండి చేసాడు. అవును మీరు వింటున్నది నిజమే.. ఒక సామాన్యమైన వ్యక్తి పర్వతాన్ని నేలమట్టం చేసాడంటే అసలు నమ్మబుద్ధి కావట్లేదు కదా! కానీ దాని వెనుక ఆయన మనోవేదన, కృషి, పట్టుదల ఎన్నో దాగి ఉన్నాయి. అసలు ఈ దశరథ్ మంజీ ఎవరు ఆయన కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

దశరథ్ ఆ పర్వతాన్ని తవ్వడం కోసం 22 ఏళ్ళు శ్రమించాడు. అలా శ్రమించి ఇప్పుడు వాళ్ళ ఊరుకో దారిని ఏర్పరచగలిగాడు. ఇప్పుడు ఆ దారిని ఎన్నో గ్రామాల ప్రజలు ఉపయోగించుకుంటున్నారు. ఓ సామాన్యుడు 22 ఏళ్ల పట్టుదలతో దారిని వేసేందుకు కొండను తవ్వడం అంటే మాటలా.. ఎంత పట్టుదల, ఎంత కృషి చేయాలి.
దశరథ్ మంజీ ‘మౌంటెన్ మ్యాన్’ ఎందుకు, ఎలా అయ్యాడు..
దశరథ్ జీవితంలో చాలా పెద్ద దెబ్బ అతడి మనసును కలిచివేసింది. అదే పట్టుదలతో కొండను తవ్వేలా చేసింది. దశరథ్ మంజీ బీహార్ లోని గెహ్లార్ గ్రామంలో జన్మించాడు. గెహ్లార్ బీహార్ రాజధాని పాట్నాకు దాదాపు 100 కి.మీ దూరాన ఉండే ఓ చిన్న పల్లె. దశరథ్ చిన్నప్పటి నుండే గనుల్లో పని చేసాడు. తర్వాత దశరథ్ కి ఫల్గుణి తో పెళ్లి జరిగింది.
అయితే దశరథ్ నివసించే గ్రామానికి బయటి ప్రపంచానికీ మధ్య ఓ కొండ అడ్డం ఉంటుంది. గెహ్లార్ వాసులు నిత్యావసరాలు తీర్చుకోవాలి అన్నా, అత్యవసర పరిస్థితుల్లో వైద్యం చేయించుకోవాలన్నా కొండ చుట్టూ 32 కి.మీ తిరగి వెళ్ళాలి. అలా వెళ్లడం వల్ల ఆ గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉండేవారు . ఆ కొండను తొలిస్తే.. కేవలం అది మూడు కిలో మీటర్ల దూరమే.

కొండకు దగ్గరలోనే దశరథ్ మంజీ క్వారీలో పని చేసేవాడు. ఓ రోజున మధ్యాహ్నం పూట, తన భార్య ఫల్గుణి, దశరథ్ కి భోజనం తీసుకుని వెళ్లింది. అప్పుడు ఆమె గర్భవతి. వెళ్తున్న క్రమంలో ఆమె కొండమీద పడిపోయింది. ఆ విషయం తెలుసుకున్న దశరథ్ కంగారుగా పరిగెత్తుకెళ్ళి చూసేసరికి ఆమె రక్తపు మడుగులో పడి ఉంటుంది. ఆ కొండ చుట్టూ తిరిగి హాస్పిటల్ తీసుకెళ్లేసరికి ఫల్గుణి చనిపోయింది.
ఇక ఆ బాధ నుంచి దశరథ్ బయటకు రావడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. ఈ కొండ వల్లనే తన భార్య ప్రాణాలు కోల్పోయిందని ఎలాగైనా సరే ఈ కొండను తవ్వేయాలని నిర్ణయించుకుని తన దగ్గర ఉన్న గొర్రెలు అమ్మి.. సమ్మెట, ఉలి, గునపాన్ని కొని 300 అడుగులు ఎత్తైన కొండను తవ్వే పని మెుదలుపెట్టాడు. మొదట్లో గ్రామస్తులు అందరూ దశరథ్ పనిని చూసి పిచ్చోడు అని నవ్వుకున్నారు. కానీ తను ఆపకుండా అలాగే కొండను తవ్వడం చూసి 10 సంవత్సరాల తర్వాత దశరథ్ సహాయం చేయడానికి కొంతమంది వచ్చారు.
దశరథ్ పట్టుదలతో చివరకు తను అనుకున్నది సాధించి ఆ ఊరికి దారిని వేశాడు. ఇప్పుడు చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు ఆ గ్రామం వాళ్లు ఆ దారి గుండనే నడుచుకుంటూ వెళ్తారు. దశరథ్ పట్టుదలను చూసి చాలామంది ప్రశంశలు కురిపిస్తున్నారు. చిన్న, చిన్న వాటికే ఆత్మహత్యల దిశగా వెళ్లే చాలామంది ఇలాంటి పట్టుదల ఉన్న మనిషిని చూసి స్ఫూర్తిగా తీసుకొని బ్రతకాలి అని దశరథ్ గురించి మాట్లాడుకుంటున్నారు.
