దక్షిణాదిన జాతీయ పార్టీలు కేవలం నామమాత్రంగానే ప్రభావం చూపించగలవు. ఇక్కడ పూర్తి హవా ప్రాంతీయ పార్టీలదే, ఇక్కడ నేతలను దేవుడిగా కొలిచే ప్రజలు, కులాల ఈక్వేషన్ లు, భావోద్వేగంతో నేతలు చేసే పబ్లిసిటీ ప్రమోషన్లు ముఖ్య పాత్ర పోషిస్తాయి. అందులో తమిళనాట రాజకీయాలు మరింత ప్రత్యేకం.
అక్కడ రెండాకుల పార్టీ, రెండు కొండల మధ్య ఉదయించే సూర్యుడు పార్టీ లైన అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలదే హవా. జయలలిత, కరుణానిధి లాంటి ఉద్దండుల అస్తమయం తర్వాత మొదటిసారి ఈ రెండు పార్టీలు ప్రజల ముందు పరీక్షకు వెళుతున్నాయి. ఇప్పటికే అన్నా డిఎంకెలో రెండు వర్గాలుగా ఉన్న పళని స్వామిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా రెండో వర్గానికి నాయకుడైన పన్నీర్ సెల్వం స్వయంగా ప్రకటించి ప్రత్యర్థులకు గట్టి సవాల్ విసిరారు.
వర్గ భేదాలు లేకుండా ముందుకు వెళుతూ పార్టీని ఎన్నికల్లో మరొకసారి గద్దెనెక్కించాలనే సంకల్పంతో ముందుకు సాగడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలు జీవితం గడుపుతున్న జయ నెచ్చలి శశికళ త్వరలోనే విడుదలవుతుంది. ఆమె విడుదలైన తర్వాత ఏ విధమైన నిర్ణయాలతో ముందుకు సాగుతారు అనేది ఆసక్తికరంగా ఉంది. బిజెపి తెరవెనుక నుండి ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపిస్తూన్న విషయం జగమెరిగిన సత్యం.
మరోవైపు డిఎంకెలో ఇంటి పోరు గోరుచుట్టుపై రోకలి పోటులా నొప్పి పెడుతూనే ఉంది. కరుణానిధి చిన్న కుమారుడు స్టాలిన్ పగ్గాలు చేపట్టినప్పటినుండి మరో తనయుడు అళగిరి వర్గం పార్టీకి దూరమైంది. ఇప్పుడు స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ని పార్టీ యువజన విభాగానికి అధ్యక్షుడిగా చేయడంతో వారిద్దరి మధ్య దూరం మరింత పెరిగింది.
అళగిరికి దక్షిణ తమిళనాడులో మధురై, తిరునల్వేలి, తూత్తుకుడి,తేనీ తదితర ప్రాంతాల్లో మంచి పట్టు ఉంది.
వీరిద్దరి మధ్య సఖ్యత కుదిరి పార్టీని ఒక్కతాటిపై నడిపించడం సాధ్యమయ్యే విషయం కాదు. ఒకవేళ అది జరిగితే అద్భుతంగానే భావించవచ్చు.
ఇక కాంగ్రెస్, బిజెపి ల విషయానికొస్తే దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్ తమిళనాడులో కొనఊపిరితో కొట్టుకుంటుంది. బీజేపీ విషయానికి వస్తే అధికారంలో ఎవరున్నా తమ మాట వినడం తప్ప వేరే గత్యంతరం లేని పరిస్థితులు అక్కడ ఉండడం వలన క్రమక్రమంగా రాష్ట్రంలో పాగా వేయడానికి పావులు కదుపుతోంది. దానిలో భాగంగానే కాంగ్రెస్ పార్టీలో ఉన్న నటి ఖుష్బూ నిన్న ఆ పార్టీకి రాజీనామా చేసి బిజెపి లో చేరారు. తమ పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా ఖుష్బూ ని బిజెపి భావిస్తోంది.
మరోవైపు కమల్ హాసన్, రజనీకాంత్ లు పార్టీలు ప్రకటించినా అవి ఎంత వరకు కార్యరూపం దాల్చి ఎన్నికల బరిలోకి దిగితాయో అనేది సందేహమే. మొత్తంగా చూస్తే 2021లో తమిళనాట జరగబోయే ఎన్నికల రసవత్తరమైన రాజకీయం ఇంగువ కలిపిన ఇడ్లీ సాంబార్ లా ఉండబోతుంది అనడంలో సందేహం లేదు. అరవ తమ్ముళ్ళ చేతిలో పార్టీల భవిష్యత్తు తెలబోయే రోజు దగ్గరలోనే ఉంది.. మరి ఎన్నికల బరిలో ఏ పార్టీ గెలవబోతుంది? ఏ పార్టీ తెల్లమొహం వేస్తుంది అనేది తేలాల్సి ఉంది.