Janasena Pawan Kalyan : జనసేన సమరానికి సన్నద్దం కావాలి..
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇంకా 16 నెలల వ్యవధే ఉంది. రెండోసారి అధికారంలోకి రావాలని వైసీపీ, ఎలాగైనా అధికార పార్టీని మట్టికరిపించాలని టీడీపీ, జనసేనలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో పొత్తులు, వ్యూహాలు, ప్రతివ్యూహాలు తెరపైకి వస్తున్నాయి. అయితే ఈ క్రమంలో జరుగుతున్న పరిణామాలు మాత్రం మిస్టరీని తలపిస్తున్నాయి. ఎవరితో ఎవరు కలుస్తారు? ఏ పార్టీ నేతలు ఎక్కడకు జంప్ చేస్తారు? తటస్థులు ఏ పార్టీలో చేరుతారు? అన్న ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతున్నాయి.
ఏపీ రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. ఇటువంటి తరుణంలో రాబోయే ఎన్నికలకు సంబంధించి , జనసేన ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటుంది ఆన్న ఆశంపై చర్యలు విశ్లేషణలు ప్రారంభ మయినాయి. బీజేపీ జనసేన పేరు జపిస్తోంది. జనసేన మీదనే దేశంలో అతి పెద్ద పార్టీ బీజేపీ భారం వేసింది. ఉత్తరాంధ్రా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో జనసేన మద్దతు మాకే అని చెప్పుకుంటోంది. అయితే జనసేన నుంచి మాత్రం ఇప్పటిదాకా బీజేపీకి మా మద్దతు అంటూ ఒక్క మాట అయితే అధికారికంగా రాలేదు. కమలనాధులు అవతల పార్టీలని గందరగోళంలోకి నెడుతున్నారా అన్నది తెలియదు కానీ ఉత్తరాంధ్రా ఎమ్మెల్సీ సీటు గెలవడం మాత్రం ప్రెస్టేజ్ ఇష్యూ అయిపోయింది.
మండలి ఏర్పడిన తరువాత, మళ్లీ పునరుద్ధరించిన తరువాత చూస్తే ఇప్పటికి అత్యధిక శాతం ఈ సీట్లో గెలిచిన పార్టీ బీజేపీ మాత్రమే. దాంతో ఈసారి కూడా నెగ్గాలని బీజేపీ భావిస్తోంది. పైగా సిట్టింగ్ సీటు అది. ప్రస్తుత ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ నే మళ్ళీ నిలబెట్టారు. దాంతో ఈ సీటు మీద పూర్తిగా శ్రద్ధాసక్తులు పెట్టి కృషి చేస్తున్నారు. అంతే కాదు 2024 ఎన్నికల్లో ఏపీలో కూడా బీజేపీ జనసేన కలసి అధికారంలోకి వస్తాయని అంటున్నారు.
ఫ్యాన్ గాలి జోరు తగ్గుతుంది.. సైకిల్ ముందుకు సాగనంది.. అన్న రీతిలో బీజేపీ నేతలు చెబుతున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఉత్తరాంధ్రా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి గెలవాలి, దానికి జనసేన మద్దతు ఇవ్వాలి. ఈ కాంబినేషన్ ఇక్కడ వైసీపీ టీడీపీలను ఓడగొడితే అపుడు ఏపీ ఎన్నికల గురించి ఆలోచించవచ్చు అంటున్నారు ప్రత్యర్ధులు. ఇంతకీ జనసేన మద్ధతు భారాన్ని మోస్తుందా, లేదా అన్నది చూడాలి..
టీడీపీ లాబీయింగ్:
ఎన్నికల్లో జగన్ ను ఓడించడానికి చంద్రబాబు చేయని ప్రయత్నమంటూ లేదు. గత ఎన్నికల్లో ఎదురైన పరిణామాలతో చంద్రబాబు ఎట్టిపరిస్థితుల్లో బీజేపీతో కలిసి ట్రావెల్ చేయాలని నిశ్చయించుకున్నారు. అదే సమయంలో పవన్ లేకపోతే తనకు ఓటమి మరోసారి ఖాయమన్న నిర్ణయానికి వచ్చేశారు. అందుకే అటు బీజేపీ ఇటు జనసేనల కోసం ఆయన తెగ తాపత్రయ పడ్డారు. అయితే పవన్ విషయంలో చంద్రబాబుకు సానుకూల పరిణామాలు కనిపిస్తున్నాయి.
బీజేపీ విషయంలో మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. రాష్ట్ర బీజేపీలో ఒక వర్గం టీడీపీని వ్యతిరేకిస్తూ వస్తోంది. మరోవర్గం మాత్రం మూడు పార్టీలు కలిస్తేనే బీజేపీ ఎదుగుదలకు సాధ్యపడుతుందని భావిస్తోంది. రాష్ట్రపతి, ఉఫరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు, అజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో ప్రధానితో వేదిక పంచుకోవడం వంటి పరిణామాలను చంద్రబాబు సానుకూలంగా మార్చుకున్నారు. అదే సమయంలో తన పాత మిత్రుల ద్వారా సంధి కుదుర్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇవన్నీ బీజేపీతో కలిసి ట్రావెల్ చేసే అవకాశాలు కల్పిస్తాయని చంద్రబాబు నమ్మకంగా ఉన్నారు.
జనసేనతో పొత్తు పెట్టుకుని 2024 నాటి సార్వత్రిక ఎన్నికలకు వెళ్లాలంటూ తెలుగుదేశం పార్టీ ఆశించినప్పటికీ- అది సాధ్యపడేలా కనిపించట్లేదు. ఎమ్మెల్సీ ఎన్నికలే దీన్ని స్పష్టం చేస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్ గా భావించే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ-జనసేన కలిసి పోటీ చేయబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. జనసేనతో పొత్తు కోసం చంద్రబాబు సాగిస్తోన్న లాబీయింగ్ ఇప్పటివరకు ఫలించనట్టే.
బీజేపీని కూడా కలుపుకు వెళదామని..
జనసేన, టీడీపీ.. రెండు పార్టీలు తమ పొత్తులో భాగంగా బీజేపీని కూడా కలుపుకువెళ్లాలనే యోచనలో ఉన్నాయి. కానీ ఆ పార్టీ నేతల నుంచి సానుకూల స్పందన వ్యక్తం కావడంలేదు. జనసేనతో తాము పొత్తులోనే ఉన్నామని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. అధికారికంగా జనసేన, బీజేపీ పొత్తులోనే ఉన్నప్పటికీ తమ అధినేతకు ఇవ్వవల్సినంత గౌరవాన్ని, ఇవ్వడంలేదన్నది బీజేపీ నాయకులను జనసైనికులు ప్రశ్నిస్తున్నారు.
పొత్తులకు సంబంధించి జనసేన స్టాండ్ వేరుగా ఉంది. రానున్న ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకూడదని, ముఖ్యమంత్రి జగన్ ను గద్దె దించాలని ప్రయత్నిస్తున్నారు. అందుకు మార్గంగా టీడీపీతో పొత్తులో వెళదామని అనుకుంటున్నారు. దీనివల్ల జనసేన పార్టీకి కూడా పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలను అసెంబ్లీకి పంపించగలుగుతుందనేది పవన్ అభిప్రాయంగా ఉంది. అయితే పొత్తులపై ఒక నిర్ణయానికి రాలేక పోవటానికి కారణం , ప్రజారాజ్యం పార్టీ నేర్పిన ఆనుభవాలు కారణం కావచ్చు. జనసేనానికి ప్రజల్లో అదరణ వున్నా జనసేన పార్టీ వ్యవస్దాపక నిర్మాణం ఇంకా జరగలేదు. నాదెండ్ల మనోహర్ ఒక్కరే కనిపిస్తున్నారు. అలాగే మధ్య తరగతి నాయకులు, గ్రామీణ , పట్టణ ప్రాంతాలలో పార్టీ శ్రేణులు సన్నద్దతతో లేరు. ఇతర పార్టీలనుంచి నాయకులను ఆహ్వానించుదామంటే చివరి వరకూ తమతో ఉంటారో లేదో తెలియని పరిస్దితి, తీరా లెక్కలు బేరీజు వేసుకుని ఆఖరి నిమిషంలో పార్టీకి దూరమైతే ఆది పార్టీ కి వ్యతిరేకతను తెచ్చిపెడుతుంది. మార్పు కోసం పనిచేసే నాయకులను యువతకు ప్రాధాన్యత నిచ్చి తర్వాత ఇతర పార్టీ ల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వాలి . పొత్తులపై ఓ నిర్ణయానికి రావాల్సిన తరుణం.
ఇవి కూడా చదవండి:
జనసేనాని మరింత సమ్యమనంతో వ్యవహరించాలి. పార్టీ వ్యవస్దీకరణ దిశగా వ్యూహాలు రచించాలి. పార్టీ విధానాలతో పాటు ప్రజలకు ఆందించే పాలన పధకాలపై కసరత్తు చెయ్యాలి. రాజధాని, మౌలిక సదుపాయాల కల్పన, విద్యుత్, పరిశ్రమలు. ఉపాధికల్పన విద్య, వైద్యం వ్యవసాయం, సంక్షేమంపై తనదైన మార్కు విధానాలను ప్రకటించాలి. పదునైన ప్రసంగాలు భావవ్యక్తీకరణపై శ్రద్ద అవసరం. తనని తాను నాయకుడిగా మార్చుకోవాలి జనాకర్షణని ఓట్లు గా మలుచుకోగలగాలి. తెలుగు దేశం కూడా కఠిన మైన నిర్ణయాలు తీసుకోవాలి. పవన్ చరిష్మా వ్యవస్దాగతంగా బలోపేతంగా ఉన్న తెలుగు దేశం కేడర్ కలిసి పనిచేస్తేనే మార్పు సాధ్యం. బి.జే పి.తో పొత్తు ఫలితాలు ఇచ్చినా అది ఆశించినంత స్దాయిలో వుండవన్నది విశ్లేషకుల ఆంచనా.. మెరుగైన ఫలితం కోసం తెలుగుదేశం తో పొత్తు శుభపరిణామం..
శ్రీధర్ వాడవల్లి – హైదరాబాద్