Janasena PawanKalyan:పవన్ మారాడా..?? పంథా మార్చుకున్నాడా..??
పవన్కళ్యాణ్ మారాడా..?? యుద్ధ రీతి మార్చుకున్నాడా..?? ఆవేశ పూరిత ప్రసంగం కాకుండా ప్రజలని ఆలోజింపచేసేలా తన పంథా మార్చుకున్నాడా?? చెప్పేది సుత్తిలేకుండా సూటిగా చెప్పాడా..??అంటే అవుననే అంటున్నాయి రాజకీయ విశ్లేష వర్గాలు
మొన్న మచిలీపట్నం లో జరిగిన జనసేన ఆవిర్భావ సభ చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ ప్రభావం చాలానే ఉండబోతుంది అనే సంకేతం వెళ్ళింది అనేది స్పష్టంగా అర్ధం అయింది.తను చెప్పాలి అనుకుంది జనాల్లోకి స్పష్టంగా తీసుకెళ్లాడు.వచ్చే ఎన్నికల పట్ల జనసైనికులకు సరైన దిశా నిర్దేశం చేస్తూనే పాలక పక్షానికి తనదైన శైలిలో చురకలు అంటించాడు.ఒక పక్క ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడుతూనే, తామేం చేస్తామో చెప్పారు.అలాగే తనపైన వచ్చిన ఆరోపణలకి నిదానంగా, నింపాదిగా సమాధానం కూడా ఇచ్చాడు… పొత్తులపై స్పష్టత ఇవ్వకున్నా కూడా.. వైసీపీ ఏం జరగకూడదు అనుకుంటుందో, అదే జరుగుతుంది అని దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు.ఇంతకీ మచిలీపట్నం సభలో పవన్కళ్యాణ్ ఏం మాట్లాడాడో.. ప్రజలకి ఎలాంటి భరోసా ఇచ్చాడో ఒకసారి చూద్దాం ..
1000 కోట్ల ఆఫర్ పై
ఇక తెలంగాణా సియం కేసీయార్ తనకి 1000 కోట్లు ఇస్తారన్న ప్రచారంపై మాట్లాడుతూ “ఆ 1000 కోట్లు ఎక్కడ ఉన్నాయా అని వెతుక్కుంటున్నా,1000 కాకుండా పదివేలు కోట్లు ఇస్తారంటే ఇంకా బాగుండేది అని అంటూనే 1000 కోట్లు అనేది అబద్దం అని కుండ బద్దలు కొట్టాడు.అయినా మిమ్మల్ని డబ్బుతో కొనగలనా అంటూ ప్రజల మనసు గెలుచుకునేలా,1000 కోట్లు అనేవారికి చెంప పెట్టులా సమాధానం ఇచ్చాడు.డబ్బులు అంటే నాకు వ్యామోహం లేదని, ఒకవేళ ఉంటే కనుక అవి ప్రజల కోసమే ఖర్చు పెడతానని కౌలు రైతుల ఉదంతం చెప్పకుండానే గుర్తుకు తెచ్చాడు. ఇది పవన్కళ్యాణ్ పరిణితికి నిదర్శనంగా భావించవచ్చు.
ఉద్యోగులకి అండగా ఉంటాం
వైసీపీ ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక ఉద్యోగుల్ని మోసం చేసిందని, ఉద్యోగుల పట్ల, వారి సమస్యల పట్ల మాట్లాడి సానుకూల దృక్పధం ఏర్పారచుకున్నారు సేనాని.CPS రద్దు అనేది తాము అధికారంలోకి వచ్చాక వారం రోజుల్లోనే చేస్తానని చేయకుండా జగన్ మోసం చేసారని విమర్శించారు.Dsc తో పాటు ఖాళీగా ఉన్న ఉద్యోగాలు కూడా తక్షణమే భర్తీ చేస్తామని కూడా ప్రకటించి నిరుద్యోగులకి హామీ ఇచ్చారు. దీనితో జనసేన ఉద్యోగుల పట్ల సానుకూలంగా ఉందనే సంకేతం ప్రజల్లోకి బలంగా వెళ్ళింది.అటు తమ సమస్యల పరిష్కారానికి జనసేన కీలకం అవబోతుంది అనేది ప్రభుత్వ ఉద్యోగుల్లోకి కూడా బలంగానే వెళ్ళింది.
అమ్ముడుపోతున్నామా??
ఇక ఎన్నికలు వస్తే మనం ఎవరిని ఎన్నుకుంటున్నాం, ఎలాంటి పరిస్థితుల్లో ఓటు వేస్తున్నాం అని పవన్ ప్రజల్ని ఆలోచింపచేశారు.ఓటుకి 2000,3000 లు తీసుకొని ఓట్లు వేసేవారు ఒక్కసారి ఆలోచించాలని అన్నారు.అలా ఓటుకి 2000 తీసుకొని ఓటు వేస్తే, ఆ 2000లు 5 ఏళ్ళకి లెక్కేస్తే అర్థ రూపాయి అవుతుందని, అలాంటి అర్ధ రూపాయి నాలుక గీసుకోవడానికి కూడా పనికిరాదు అని అన్నారు.అపార్ట్మెంట్లలో ఉండేవారు, డిగ్రీలు చేసినవారు కూడా ఓటు అమ్ముకుంటే ఎలా అని ప్రశ్నించారు.ఇలా అయితే రాజకీయాల్లో విలువలు పాటించే నాలాంటి వారు ఎప్పటికీ ఓడిపోతుంటారు అని అన్నారు.మార్పు కావాలి అంటే అందుకు నేను ఎప్పటికీ సిద్ధం అని ప్రకటించాడు.దీనితో ఎన్నికలు వస్తే డబ్బులకి అమ్ముడుపోవద్దనే అంశం కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళగలిగాడు. ఒక ఆలోచన రేకేత్తించాడు.
అవసరం అయితే బీజేపీకి దూరం అవుతా
బీజేపీతో పొత్తు అనేసరికి ముస్లింలు దూరం అవుతారని కొందరు అంటున్నారని,వారికి ఇష్టం లేకుంటే బీజేపీకి దూరం అవుతానని అన్నారు.అలాగే ముస్లిం సమాజం జగన్ ని నమ్ముతుంది, జగన్ ఢిల్లీ వెళ్తే ఏం చేస్తారో నాకు తెలుసు. బీజేపీకి జగన్ ఎలా మద్దతిస్తారు..??మరి ముస్లిం సమాజం జగన్ ని ఎలా సమర్దిస్తుంది అని వాళ్లలో ఆలోచనని రేకేత్తించారు పవన్. అంటే ప్రత్యేక హోదా విషయంలో జగన్ చేసింది ఏమిలేదని తేలిపోయేలా చేశాడు.అందుకని ముస్లిం సమాజం జనసేన గురించి కూడా ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. మతం చాలా సున్నితమైన అంశం అని చెప్పారు.
కులమా..?? గుణమా..??
మారుతున్న రోజుల్లో చదువుకున్న యువత కులాల ఉచ్చులో పడొద్దని సూచించారు.”నాకు అన్ని కులాల్లో అభిమానులు ఉన్నారు అని, ఓటు వేసే సమయంలో ఈ రాష్ట్ర సియం మా కులపోడు అని చూసి ఓటేస్తారా..?? అతను నిజంగా నిజాయితీపరుడు అయితే, నేను రాజకీయాల నుండి తప్పుకుంటాను అన్నారు.అతను మహానుభావుడు, నిజాయితీపరుడు కానప్పుడు కులం చూసి ఓటేస్తారా.. గుణం చూసి ఓటేస్తారా మీరే నిర్ణయించుకోవాలి” అని ప్రజల్ని ప్రశ్నించారు
SC, ST సోదరులు మేలుకోవాలి
Sc, st సోదరులకు సంఖ్యా బలం ఉన్నా కూడా, ఇంకా దేహీ అనే పరిస్థితుల్లోనే ఉన్నారని, వారిలో అనైక్యత భావం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది అని ఆవేదన వ్యక్తం చేశారు.ఐక్యంగా ఉన్నప్పుడే ఆర్థిక స్వాతంత్రం వస్తుంది. ఏపీలో ఒక కులం పెత్తనం ఆగిపోవాలి అని, ప్రభుత్వం కులాల మధ్య చిచ్చు పెడుతుందని.. వారిని విడదీసే ప్రయత్నం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.అగ్ర వర్ణ కులాల్లోని పేదల గురించి కూడా ప్రభుత్వం ఆలోచించాలి అన్నారు.
తాము అధికారంలోకి వస్తే అన్ని కులాలవారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఎప్పటికైనా జనసేన జెండా ఎగురవేస్తాం
రాష్ట్రంలో ఎప్పటికైనా జనసేన జెండా ఎగురావేస్తాం అని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణాలో 30 వేల మంది…పులివెందుల సహా అన్నిచోట్లా క్రియాశీల కార్యకర్తలు జనసేనకి అండగా ఉన్నారని అన్నారు.ప్రజలకి అండగా ఉండాలంటే ధర్మాన్ని నిలబెట్టాలని…జనసేన పార్టీ దాన్ని నిలబెడుతుందని,రాజకీయ అవినీతిపై తిరుగులేని పోరాటం చేస్తామని వెల్లడించారు జనసేనాని.