Janasena Yuvashakti : సిక్కోలు గడ్డ.. ఆ నేల అంతే.. నిమ్మళంగా ఉండదు.. ఆ నేల తిరుగుబాటు కు పుట్టినిల్లు.. దిక్కారానికి దిక్సూచి. పోరాటాల పురిటిగడ్డ. మలి దశ నక్షల్బరీ ఉద్యమానికి ఊపిరి పోసి నాయకుల త్యాగాలు ను చరిత్రగా మిగిల్చిన గొప్ప రణ స్థలం. ఎంపటాపు సత్యం, ఆదిభట్ల కైలాసం, పంచాది నిర్మల, పంచాది సత్యం, పంచాది కృష్ణ మూర్తి లాంటి యోధులకు జన్మనిచ్చిన గడ్డ.. సుబ్బారావు పాణిగ్రాహి, ఇక్కడ చీమలు పొడిచిన పాములున్నయట అని గళం విప్పిన వంగపండు కాలికి గజ్జె కట్టుకొని తిరిగిన గొప్ప నేపథ్యం ఉన్న స్థలం.. రణస్థలం.. ఆ రణస్థలమే ఈ రోజు (12,జనవరి) జనసేన “యువశక్తి” కి వేదిక.. మరి కొద్దిసేపట్లో కార్యక్రమం మొదలు కానుంది..
Also Read : వైసిపి గెలుపు ‘ గాలి ‘ వాటమేనా…?
ప్రశ్న, చర్చ, పోరాటం ఇవి తప్పనిసరిగా మానవ జీవితం లో భాగం. పాలించే నాయకులు ఒకవైపు ప్రశ్నించే నాయకులు ఒకవైపు.. కనీసం గొంతు మెదపలేని మేధావులు, తప్పుని నిలదీయలేని తుప్పు పట్టిన మెదళ్ళు ను చూసి ఒక్కోసారి బాధ కలుగుతుంది.
ఎవరు మాట్లాడినా శ్రద్దగా వినాలి. తప్పులుంటే ఎండగట్టి తాట తియ్యాలి. కానీ దైర్యం గా మాట్లాడాలి. మాట్లాడుతూనే ఉండాలి యువత మౌనాన్ని బద్దలుగొట్టి మాట్లాడుతూనే ఉండాలి. ఈరోజు ప్రజల తరపున, నాగావళి, మహేంద్ర తనయ నదీ పరివాహక ప్రాంతం లో రాష్ట్ర యువత గళం విప్పనున్నారు. ఇదో శుభ పరిణామం..
ఈరోజు జనసేన నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఒక రకంగా రాబోయే ఎన్నికల కోసం జనసేన మొదటి అడుగుగా భావించవచ్చు. రాష్ట్ర రాజకీయాల్లో ఈరోజు జనసేన ఒక సంచలనం సృష్టించే అవకాశమే ఉంది. ఈ సభ గురించి ఇపుడు రాష్ట్ర వ్యాప్తం గా పెద్ద చర్చ నడుస్తోంది. జనసేన అధ్యక్షులు పవన్కళ్యాణ్ ఈ రోజు మాట్లాడే మాటలు వినాలని జనం ఆశక్తి గా ఎదురు చూస్తూ ఉన్నారు.