మన దీపమని ముద్దు పెడితే మూతి కాలకుండా ఉంటుందా అన్నట్టుగా తయారైంది ఆంధ్ర మందుబాబుల పరిస్థితి. అత్యధిక మెజార్టీతో జగన్ సర్కార్ గద్దెనెక్కడంలో మందుబాబులు కీలక పాత్ర పోషించారు.
గత ప్రభుత్వ హయాంలో క్వార్టర్ బాటిల్ పై 15 రూపాయలు పెంచితే లబోదిబోమని నెత్తి నోరు కొట్టుకున్న మందుబాబులకు, జగన్ సర్కార్ కరెంట్ షాక్ ట్రీట్మెంట్ రేంజ్ లో షాక్ ల మీద షాక్ లు ఇస్తుంది. అధికారంలో రాగానే మద్యంపై విపరీతమైన ధరలు పెంచిన జగన్ సర్కార్ ఒక దశలో పసిడి ధరల తో పోటీ పడే విధంగా మద్యం ధరలు పెంచుతామని చేసిన ప్రకటనలకు మందుబాబులకు మద్యం తాగకుండానే తల తిరిగిన పరిస్థితి. దానికి ఉపశమనం లాగా ఇతర రాష్ట్రాల నుండి మద్యం 3 బాటిల్స్ తెచ్చుకోవచ్చని హైకోర్టు ఇచ్చిన తీర్పు వలన ఆంధ్ర లో దొరికే నాసిరకం లిక్కర్ తాగి ఆరోగ్యం పాడు చేసుకునే పరిస్థితి నుండి విముక్తి లభించింది అని ఊపిరి పీల్చుకున్నారు.
ఇప్పుడు ఆ మార్గం కూడా లేకుండా ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకోవటంపై కొత్త జీవో విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ.
ఆ జీవో ప్రకారం పరిమిట్లు, లైసెన్స్ లేకుండా ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకునేందుకు వీల్లేదు. ఈ మేరకు జీవో లో ప్రభుత్వం స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చింది. ఇకపై గతంలో మాదిరిగా 3 మద్యం బాటిల్స్ తెచ్చుకునేందుకు అనుమతి లేదు. ఇతర దేశాల నుంచి మద్యం తెచ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనుమతి ఇచ్చింది. ఇతర రాష్ట్రాల నుంచి పర్మిట్ లేకుండా మద్యం తెస్తే 1968 ఏపీ ఎక్సైజ్ చట్టం ద్వారా శిక్షార్హులు అని జీవో నెంబర్ 310ని ఎక్సైజ్ శాఖ విడుదల చేయడంతో జగన్ సర్కార్ కు ఓటు వేసిన మందుబాబులు కక్కలేక మింగలేక పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని లోలోపలే తిట్టుకుంటున్నారు.
తమ కమీషన్ల కోసం ఊరు పేరు లేని నాసిరకం బ్రాండ్లను తమ నెత్తి మీద రుద్దడం, చీప్ లిక్కర్ కూడా మధ్య స్థాయి రేట్లకు అమ్మడం చూసిన మందుబాబులు జీవితంలో మళ్ళీ బుద్ధి అనేది ఉంటే జగన్ సర్కార్ కు ఓటు వేసేది లేదని, వైసిపి గుర్తులోని ఫ్యాన్ లాగా మా జీవితాలు కూడా గిరగిరా తిరుగుతున్నాయని వాపోతున్నారు.