ఆంద్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు గళం ఎందుకు మూగబోయింది? అధ్యక్ష భాద్యతలు స్వీకరించాక ఒక రేంజ్ లో ప్రతిపక్ష టీడీపీ పై ఆయన దాడి చేసిన విధానాన్ని చూసి అధికార పక్ష నేతలే అవాక్కయ్యారు. అసలు అధికారంలో లేని మాపై సోము దాడి చేయడం ఏంటని టీడీపీ నేతలు మండిపడ్డారు కూడా. ఏది ఏమైనా కార్యకర్తల్లో జోష్ నింపింన సోము కొన్ని రోజులుగా మౌనాన్ని ఆశ్రయించారు. టీవీ చానల్స్ లో గానీ మీడియా సమావేశాల్లో గానీ ఆయన కొంచెం ఆచి తూచి మాట్లాడుతున్నారు. బీజేపీ అధిష్టానం నుంచి ఆయన వ్యతిరేక వర్గం చేసిన వత్తిడి ఫలితంగానే ఆయన వైఖరిలో మార్పు వచ్చిందేమో అనే గుసగుసలు మొదలయ్యాయి. అసలు ఆంధ్రప్రదేశ్ కాషాయ దళంలో ఏం జరుగుతుంది అనే చర్చ కూడా మొదలయ్యింది.
బీజేపీతో సఖ్యత కోసం టీడీపీలో ఒక వర్గం ఇప్పటికే బలంగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇటీవలే బీజేపీలో చేరిన ఒక వర్గం నిరంతరం అదే దిశలో ప్రయత్నాలు ప్రారంభించింది. జాతీయ కార్యవర్గాన్ని బీజేపీ విస్తరించాకా సోము వైరి వర్గంలో వారికి కూడా అక్కడ స్థానం లభించడంతో రాష్ట్ర రాజకీయాల్లో కూడా వారికి కొంత వెసులుబాటు లభించింది. దరిమిలా జరిగిన కొన్ని పరిణామాలు కూడా వీర్రాజు దూకుడుకు అడ్డుకట్ట పడుతున్నట్టు చెబుతున్నారు. నూటికి నూరుపాళ్లు సైద్ధాంతిక మూలాలు ఉన్న సోము వీర్రాజు బీజేపీని ఆంద్రప్రదేశ్ లో నిర్ణయాత్మక శక్తిగా మార్చాలని పట్టుదలతో వున్నారు. జిల్లాల వారీగా మెజారిటీ బీజేపీ నేతలు సోము వెంటే వున్నా వలస నాయకులని అధిష్టానం ప్రోత్సహించడం ఆయనకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. జనసేనతో కలిసి ప్రయాణం చేసి సత్తా చాటాలని ఆయన అనుకున్నా అధిష్టానం ఆంధ్రప్రదేశ్ లో పార్టీ బలపడటానికి అవసమైతే కొత్త పొత్తుల కోసం కూడా ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది.
వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల తర్వాత జరిగే కేంద్ర మంత్రివర్గ విస్తరణలో ఎన్డీయే లో చేరాలని వైసీపీని బీజేపీ ఆహ్వానించినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై వైసీపీ ఆచితూచి అడుగులు వేస్తోంది. బీజేపీకి ఎప్పుడూ తగిన సహకారాన్ని అందిస్తూ తాము నమ్మకమైన మిత్రుడుగా నిరూపించడం కోసం ప్రయత్నం చేస్తోంది. టీడీపీ ఎటూ బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. బీజేపీ అండతో వైసీపీని కట్టడి చెయ్యాలనే ప్రయత్నాలు నిరంతరం చేస్తూనే ఉంది. కాకపోతే చంద్రబాబు మీద వున్న అసహనం, ఆయన నిలకడ లేని నిర్ణయాలు వల్ల దాదాపుగా వారి కోరిక తీరే అవకాశం ప్రస్తుతానికి కనుచూపు మేరలో కనిపించడం లేదు.ఇవన్నీ ఆంధ్ర ప్రదేశ్ దేశ్ బీజేపీ పై ప్రభావం చూపిస్తున్నాయి.
బీజేపీ అధిష్టానం త్రిముఖ వ్యూహం అనుసరించడంతో రాష్ట్రంలో బీజేపీ జనసేన పొత్తు అనేది ఎంతకాలం కొనసాగుతుందో ఇంకా నిర్దారణకు వచ్చే అవకాశం లేదు. వైసీపీ కేంద్ర మాంత్రివర్గంలో చేరితే బీజేపీ జనసేన పొత్తుకు అర్థమే లేదు. పరిస్థితులు గాడిలో పడేవరకు సోము వీర్రాజుకు మౌనమే శరణ్యం అని భావించక తప్పదు.