Natures Wonder : సూర్య,చంద్రులు ఈ ప్రకృతిలో ముఖ్య భూమికలు. పగలంతా సూర్యుడు, రాత్రి కాగానే చల్లటి చంద్రుడు ఈ సృష్టికి మూలాధారాలు. సూర్య,చంద్రులది ఒక అందమైన కలయిక. పగలంతా సూర్యుడి ప్రతాపం ఎంత చూపించినా కూడా రాత్రి కాగానే ఆ చల్లటి చంద్రుని నీడలో హాయిగా మనం నిద్రపోతుంటాం. అది ప్రకృతి ధర్మం. కానీ ఒక దేశంలో మాత్రం పగలు, రాత్రి తేడా లేకుండా సూర్యుడే తన రాజ్యాన్ని ఏలుతాడు.
పగటిపూటనే సూర్యుడిని తట్టుకోవడమే గగనం. అలాంటిది ఆ దేశంలో రాత్రి కూడా పగలు మాదిరిగానే అధిక వెలుతురుతో వెలిగిపోతూ ఉంటుంది. ఇంతకీ ఆ దేశం ఎక్కడ..? ఆ విచిత్రమేమిటి…! ఆ దేశంలో సూర్యుడు అస్తమించడు. సోమా రోయ్ ద్వీపంలో ఈ అద్భుతమైన దృశ్యం మనం చూడవచ్చు. ఇది నార్వేలో ఉంది. అయితే కొన్ని నెలల మాత్రమే ఇలా జరుగుతుంది. అక్కడ మూడు నెలల కంటే అధిక సమయం సూర్యుడు అస్తమించడు.
ఆర్కిటిక్ సర్కిల్ లో ఉన్న ఒక ద్వీపమే ఈ సోమారోయ్. ఇక్కడ వేసవిలో 24 గంటల పాటు సూర్యుడు ప్రకాశిస్తూనే ఉంటాడు. మే మధ్య నుండి మొదలుకొని జూలై చివరి వరకు సుమారుగా 70 రోజులపాటు సూర్యుడు అస్తమించకుండా కనిపిస్తూనే ఉంటాడు. ఇంకో విచిత్రము ఏమిటంటే ఇక్కడ మూడు నెలలు చీకటి కనిపించదు. అలాగే శీతాకాలంలో మూడు నెలల పాటు చీకటి కమ్మేస్తుంది.
ఇక్కడ జనాభా కేవలం 300 నుండి 350 మంది మాత్రమే. కొన్ని సంవత్సరాల క్రితమే ఈ ద్వీపాన్ని టైం ఫ్రీ జోన్ గా ప్రకటించారు. నిత్యం వెలుతురు ఉండడం ద్వారా అర్ధరాత్రి పూట కూడా ప్రజలు తమ పనుల్లో బిజీగా ఉంటారు. ఈ నార్వే ద్వీపాన్ని టైం ఫ్రీ జోన్ అని ఎందుకు అన్నారంటే.. ఇక్కడ సమయానికి పరిమితి లేదు. ఎందుకంటే కొందరు రాత్రి రెండు గంటలకు పెయింటింగ్ వేయడం ఈత కొట్టడం ఫుట్ బాల్ ఆడడం లాంటి పనులు కూడా చేసేస్తారు. సౌకర్యంగా ఉండే సమయాల్లోనే స్కూల్స్ తెరిచి ఉంచుతారు. సమయానికి, పనికి ఇక్కడ సంబంధమే ఉండదు. అందుకే ఆ ద్వీపానికి ఆ పేరు వచ్చింది.