ఆహా ఓటీడీలో స్ట్రీమింగ్ అవుతున్న అన్ స్టాపబుల్ టాక్ షోలో ఉత్తర దక్షిణ ధ్రువాల వంటి పవన్ – బాలయ్యల కలయిక అనేది ట్రెండింగ్ లో నిలుస్తున్న అంశం. వీరిద్దరూ ఒకే వేదికను పంచుకోవడం అనేది అటు మెగా, నందమూరి అభిమానులకే కాదు, ఇండస్ట్రీ వర్గాలకు కూడా ఆశ్చర్యం కలిగించే విషయమే.
అన్ స్టాపబుల్ అనే టైటిల్ తో ఇండియాస్ టాప్ 1 టీవీ షో తో దూసుకుపోతున్న బాలయ్య కి అగ్నికి ఆజ్యం తోడైన విధంగా పవర్ స్టార్ కలవడం అనేది ఆహా కు పోటీగా ఉన్న ఓటీటీ సంస్థల వెన్నులో వణుకు పుట్టించే అంశం.
ఇప్పటికే ఈ షో దెబ్బకి బిగ్ బాస్, జబర్దస్త్ లాంటి టాప్ టెలివిజన్ షోలు మసకబారిన పరిస్థితి..
అయితే ఇక్కడే మరో కోణం చర్చలోకి వస్తుంది.
ఇండస్ట్రీలో నంబర్ వన్ గా ఉన్న పవన్ కళ్యాణ్ కి ఈ షోలో పాల్గొనడం వల్ల వచ్చే లాభం ఏమిటీ(Pawan Kalyan at Unstoppable)? అనేది.. దీని వెనుక చాలా కారణాలే ఉన్నాయ్..
పోలిటికల్ గా బాలయ్య, పవన్ లకు రాబోయే రోజుల్లో అతి పెద్ద పరీక్ష ఏపీలో జరగబోయే ఎన్నికల రూపంలో ఎదురుకాబోతుంది. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీలు కూటమిగా పోటీ చేసినా, విడివిడిగా పోటీ చేసినా కచ్చితంగా గెలిచి తీరాల్సిన పరిస్థితి.
ఇరు పార్టీల పొత్తులు ఎత్తులు సంగతి పక్కన పెడితే, ప్రజల్లోకి తమ ఆలోచనలు ఎంత ఎక్కువ చేరువైతే అంతగా ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉన్నదని ఇరువురికి తెలుసు.
పైగా పవన్ కళ్యాణ్ పొలిటికల్ మీటింగ్లకు తెలుగు మీడియా పెద్దగా కవరేజ్ ఇవ్వని పరిస్థితి. సంక్రాంతి తర్వాత పవన్ బస్సు యాత్ర ప్రారంభం కాబోతోంది. దీనికోసం “వారాహి” అనే వాహనాన్ని ఇప్పటికే సిద్ధం చేసిన పవన్ కళ్యాణ్ కు ఈ అన్ స్టాపబుల్ టాక్ షో ద్వారా తన మనసులోని విషయాలను, మాటలను గ్లోబల్ గా ఉన్న తెలుగు వారందరికీ తెలియజేసేందుకు ఒక చక్కని అవకాశం లభించింది. అందుకేనేమో ఇటీవలే బాలక్రిష్ణ పవన్ ని ఈ షో కి రావాలి అని తన మనసులో మాట చెప్పగానే పవన్ ఆ అవకాశాన్ని అంది పుచ్చుకున్నారు.
Also Read: జనసేన దెబ్బ.. వైసీపీ అబ్బా
నిజానికి పవన్ కళ్యాణ్ కి ఇది ఒక అనుకోని అవకాశం. తనపై వస్తున్న వ్యక్తిగత విమర్శలపైనే కాక జనసేన పార్టీ గురించి, త్వరలో చేయబోయే యాత్ర గురించి, జనసేన పార్టీ భవిష్యత్ కార్యకలాపాల గురించి ప్రజలకు ఎక్కువగా చేరువయ్యేలా చేయగల కార్యక్రమం ఇది.
ఇక షూటింగ్ టైం లొనే ఈ కార్యక్రమం పై వైసీపీ చేస్తున్న విమర్శలు చూస్తుంటే రిలీజ్ అయ్యే సరికి ఈ విమర్శల తోటే ఈ ప్రోగ్రాం జనానికి మరింత చేరువయ్యే సూచనలు కనిపిస్తూ ఉన్నాయ్. ప్రోగ్రాం రిలీజ్ అయ్యాక కూడా దీని ప్రచార బాధ్యతలు ఎక్కువగా వైసీపీ నే తీసుకుంటుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు. ఆ విమర్శలు కూడా పవన్ కళ్యాణ్ పైనే అవడం తో జనసేనకు అదో మైలేజ్.. నిజమే రాజకీయం లో మంచో.. చెడో జనం నోళ్ళలో నానడం కంటే మించిన ప్రచారం ఏముంది..? సో ఎటు తీసుకున్నా ఇది పవన్ కళ్యాన్ కి ప్లస్సే తప్ప మరొకటి కాదు.
ఏదేమైనా వచ్చే సంక్రాంతికి ఆహాలో స్ట్రీమింగ్ కాబోతున్న ఈ ఎపిసోడ్ మునుపటి రికార్డులను తిరిగిరాసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల అంచనా.