రాజకీయాల్లోకి వచ్చిన వాళ్లు అధికారమే పరమావధిగా జీవించాలా? లేక ప్రజల సమస్యల పరిష్కారం కోసమే తన వృత్తి, వ్యక్తిగత జీవితం మొత్తంగా పణంగా పెట్టాలా?
అధికారం లేనప్పుడు రాజకీయాల్లో కొనసాగటం అనవసరం అని మెజారిటీ రాజకీయ నాయకుల అభిప్రాయానికి భిన్నంగా కొనసాగే వారు చాలా అరుదుగా ఉంటారు. ముఖ్యంగా ధనము, కులము, ఆశ్రిత పక్షపాతం అంతులేకుండా పోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఒక నిజాయితీతో కూడిన రాజకీయం చేయడానికి ఒక మనిషి ముందుకు వచ్చాడంటే సాహసమనే చెప్పాలి.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పార్టీ ఆవిర్భావం తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం దాదాపుగా అన్నీ అపజయాలే. తాను పోటీ చేసిన రెండుచోట్ల ఓటమి పాలైనా ప్రజల తరపున తన స్వరం వినిపించడం మానలేదతను. ఎక్కడ బాధితులు ఉంటే అక్కడ నిలబడి వారి గళాన్ని వినిపించడమే జనసేన విధానం అని చెప్పి పవన్ కళ్యాణ్ ముందుకెళుతున్నారు. పార్టీ నిర్మాణంలో లోపాలు ఉన్నా ప్రత్యర్థి పార్టీలు అడుగడుగునా అవాంతరాలు సృష్టించి సవాళ్లు విసురుతున్నా ఈ అలుపెరగని బాటసారి తన విధానాన్ని విడవకుండా పట్టువదలని విక్రమార్కుడు లా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.
వేల కోట్ల రూపాయలు మంచినీళ్ల ప్రాయంగా ఖర్చుపెడుతున్న రాజకీయ పార్టీల మద గజాల పొగరు అణచిటానికి తన కున్న సైన్యంతో దండయాత్ర చేస్తూనే ఉన్నారు. ఆపద అంటూ తలుపు తడితే తన గళమే ఆయుధంగా మార్చి పాలక పక్షం ఏదైనా నిలదీస్తూనే వున్నారు. విజయానికి అపజయానికి మధ్య నలిగిపోతున్నా.. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముడుతూనే ఉన్నా.. తను నమ్మిన సిద్ధాంతం కోసం తనను నమ్ముకున్న సైన్యం కోసం జనసేనాని పోరాటం కొనసాగుతూనే ఉంది. ప్రజాస్వామ్యంపై అచంచలమైన విశ్వాసం ధన రాజకీయాలకు భిన్నంగా ప్రజల్లో మార్పు కోసం కొండంత ఓర్పుతో తన మలిదశ యుద్ధం కోసం అస్త్రసస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు.
ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన ఒక కీలకమైన రాజకీయ పక్షం. ఆ పార్టీ మద్దతు కోసం అడగనివారు లేరు. ఆ పార్టీని తీవ్రంగా వ్యతిరేకించే వారు లేకుండాలేరు. గెలుపు కోసం అడ్డదారులు తొక్కే సమకాలీన రాజకీయాల్లో విలువలతోనే రాజకీయం చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించిన విధానాన్ని విమర్శకులు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక అభిమానుల మాటల్లో చెప్పాలి అంటే.. “పాలించాలనుకునే వాడికి రాజ్యం కావాలి.. వాడికి సింహాసనం ఒక్కటే సొంతం.. రక్షించుకోవడానికి సేనాధిపతి రావాలి.. వాడికి రాజ్యం మొత్తం సొంతం.” అంటూ.. వేలాదిమంది యువత సేనాని అడుగులో అడుగు కలిపి కదం తొక్కుతున్నారు. అవినీతి,ఆశ్రిత పక్షపాతం,బంధుప్రీతిలాంటి చీకట్లని పారద్రోలి ఆంద్రప్రదేశ్ రాజకీయ యవనికపై వెలుగులీనుతున్న కాంతుల ఖడ్గంలా కొందరు జనసేన ను చూస్తున్నారు. ఈ మహాయజ్ఞాన్ని నిర్విరామంగా కొనసాగిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ కి ట్రెండ్ ఆంధ్ర డాట్ కామ్ హృదయ పూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు.