వైసీపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల వ్యవహారం కొంతమంది లీడర్ల పుట్టి ముంచేలా ఉంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో హర్షం వ్యక్తమైనా గుంటూరు, కృష్ణా జిల్లాల్లో అధికార వైసీపీ నేతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.
రాజధాని ప్రాంతంలో దాదాపు 300 రోజులుగా జరుగుతున్న ఆందోళనలకి ప్రత్యక్షంగా ప్రజల మద్దతు లేకపోయినా ఒక్కసారిగా అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో ప్రభుత్వం ఎక్కడి పనులు అక్కడే నిలిపివేయడంతో ఒక్కసారిగా వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వివిధ రూపాల్లో అమరావతి నే రాజధానిగా కొనసాగించాలని అక్కడ ప్రజలు ప్రతిపక్ష పార్టీలతో కలిపి ఉద్యమం చేస్తున్నారు.
ప్రభుత్వం మాత్రం రాజధాని వికేంద్రీకరణకే మొగ్గు చూపుతూ వారి ఆందోళనలు ఏమాత్రం పరిగణనలోకి తీసుకోవడం లేదు. పైగా అది పెయిడ్ ఉద్యమంగా ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తులు కూడా కామెంట్ చెయ్యడం జీర్ణించుకోలేని రాజధాని పరిసర ప్రాంత ప్రజలు స్థానిక నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలు తరుముకుని వస్తున్న తరుణంలో కృష్ణా గుంటూరు జిల్లా నాయకులు ప్రజలకు సమాధానం చెప్పలేని పరిస్థితిలో వున్నారు.ప్రభుత్వ నిర్ణయంతో ఒక్కసారిగా పాతాళానికి పడిపోయిన రియల్ ఎస్టేట్ ధరలు, ఆగిపోయిన నిర్మాణాలతో వేల మంది ఉపాధి కోల్పోయారు.
రాజధాని కోసం భూములిచ్చిన రైతులు ఎటూ పాలిపోని స్థితిలో స్థానిక నాయకత్వాన్ని నిలదీస్తుండటంతో వారికి ప్రతిరోజు విషమ పరీక్షలా కాలం గడుస్తోంది.అప్పుడప్పుడు వచ్చి పలకరించి పోయే టీడీపీ నేతల్ని సైతం వారు గట్టిగానే నిలదీస్తుండటంతో క్రమంగా వారు కూడా ప్రభుత్వం పై ఆరోపణలు చేసి తప్పించుకుంటున్నారు.
చంద్రబాబు చేసిన కొన్ని వ్యూహాత్మక తప్పిదాల వల్ల ప్రస్తుతానికి అమరావతి కల సాకారంకాలేకపోయినా అధికార వైసీపీ నేతల రాజకీయ భవిష్యత్ మాత్రం ప్రమాదంలో పడింది.ఆగ్రహంతో ఉన్న స్థానిక ప్రజలు తమకు వ్యతిరేకంగా ఓటు వేస్తే తమ పరిస్థితి ఏమిటన్న ఆలోచనలో కొంతమంది నాయకులు ఉన్నట్టు వారి సన్నిహితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీ మాత్రం ఎన్నికల నాటికి రైతులకు న్యాయం చేసి పరిస్థితి సానుకూలంగా మలుచుకోవలని చూస్తోంది. దాదాపు 20 నియోజకవర్గాల్లో ప్రభావితం చేసే అంశం కావడంతో వైసీపీ నేతలు ఆచితూచి అడుగులు వేస్తున్నారు.
ఏది ఏమైనా రాజధాని మార్పు విషయంలో వైసీపీ అధినేత జగన్ ఇప్పటికే స్పష్టత ఇవ్వడంతో రాజకీయంగా కొద్దిగా నష్టపోయినా మిగిలిన ప్రాంతాల్లో ఉన్న సానుకూలత తమకు కలసివస్తుందని కొందరు వైసీపీ నేతలు ధీమాగా వున్నారు.
