అమరావతి వేదిక గా జరుగుతున్న రాజకీయ దుమారం ఇప్పట్లో ఆగేలా లేదు. రాజధాని ప్రాంతంలో టీడీపీ నాయకులు ఇన్ సైడర్ ట్రేడింగ్ కి పాల్పడ్డారని ప్రభుత్వం ఇప్పుడు సీఐడీ విచారణకు ఆదేశాలు ఇచ్చింది. దానిలో భాద్యులు గా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరియు లోకేష్ పై ప్రధానమైన ఆరోపణలు చేస్తూ ఈ రోజు మీడియాలో భారీ ఎత్తున కథనాలు వచ్చాయి. ఒక వైపు అమరావతిని రాజధాని గా కొనసాగించాలని రైతులు ఆందోళనలు చేస్తుండగానే ప్రభుత్వం తీసుకున్న సంపూర్ణ దర్యాప్తు అంశంపై టీడీపీలో ఆందోళన నెలకొంది.
అసలు ప్రభుత్వ వ్యూహం ఏమిటో అర్థంగాక టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఒకవైపు విచారణలకు టీడీపీ భయపడేది లేదంటూనే జరుగుతున్న పరిణామాలు నిశితంగా పరిశీలిస్తున్నారు. ముప్ఫై మూడు వేల ఎకరాల భూ సమీకరణ చేసిన టీడీపీ ప్రభుత్వం రాజధాని నిర్మాణం ప్రకటన కి ముందే కొంతమంది నేతల ద్వారా భూమి కొనుగోళ్ళు చేసిందని దానికి సంబంధించిన పూర్తి సమాచారం తమ దగ్గర ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రాజ్యాంగ పరమైన రహస్యాలని కొంతమంది నాయకులకి సమాచారం ఇచ్చి ప్రభుత్వ పరమైన గోప్యత పాటించకుండా అప్పటి ప్రభుత్వం ఒక రకమైన వంచనకు పాల్పడిందని వైసీపీ నేతలు మండిపోతున్నారు.
ఇదిలా ఉండగా జగన్ దీనిపై ద్విముఖ వ్యూహంతో వెళుతున్నట్టు తెలిసింది. రాష్ట్రంలో సీఐడి విచారణకు అదేశించి ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో కూడా ఈ అంశం ప్రస్తావించి టీడీపీని మరింత ఇరుకున పెట్టె ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీతో టీడీపీ తెగదెంపులు చేసుకోవడం వల్ల కేంద్రంలో కాంగ్రెస్ కి కూడా దూరంగా ఉండటం వల్ల ప్రస్తుతానికి టీడీపీ అక్కడ ఒంటరి పోరాటం చేస్తుంది. రానున్న రోజుల్లో ఈ విచారణ అరెస్టులకి దారి తీస్తే ఏవిధమైన కార్యాచరణ ప్రణాళిక అవలంభించాలి అనే అంశంపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మల్లగుల్లాలు పడుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఈ అంశంపై సీనియర్లతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. విచారణను ఎదుర్కొని టీడీపీ అసలు బయట పడుతుందా లేక పీకల్లోతు కష్టాల్లో కూరుకుని పోతుందా అనేది వేచి చూడాలి.
