ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడకు మీడియా పాత్ర అత్యంత కీలకం. ప్రజల తరపున ఉండాల్సిన వ్యవస్థలు పార్టీల వైపు ఉంటే జరిగే నష్టం అపారంగా ఉంటుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈ పరిస్థితి మరింత దయనీయంగా ఉంది.తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా కొన్ని సంస్థలు వైసీపీకి అనుకూలంగా మరికొన్ని సంస్థలు విడిపోవడంతో నిత్యం సగటు పాఠకుడు గందరగోళంలొనే వున్నాడు.ప్రభుత్వాలకి డబ్బా కొట్టే సంస్థలు ఆయా ప్రభుత్వాల ద్వారా లబ్ధి పొందుతూ అంతిమంగా ప్రజలకు తీరని నష్టం చేస్తున్నాయి.ఇటువంటి పోకడలకు మొదట పునాది వేసింది చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అని చెప్పక తప్పదు.
తెలుగుదేశం పార్టీకి అనుకూల మీడియా సంస్థలు ఎన్నికల ముందూ ఎన్నికల తర్వాత కూడా వైసీపీ చేసిన ప్రతి కార్యక్రమంపై దుమ్మెత్తి పోస్తూ.. ప్రజల దృష్టిలో చులకన అయ్యాయి. టీడీపీ తప్ప ఏ పార్టీ కూడా అధికారంలోకి రాకూడదు అనేంతగా ఏడిటోరియల్ పాలసీని ముందుకు తీసుకుని వెళుతున్నాయి. ఒకే విధమైన భావజాలం ఉన్న వ్యక్తులని చర్చలో కూర్చోబెట్టి ప్రతిరోజూ సాయంత్రం ప్రభుత్వ విధానాలపై బురదజల్లటం దినచర్యగా మార్చుకుంటున్నాయి. చివరకు వాళ్ళు నిజం చెప్పినా కూడా ప్రజలు నమ్మలేని దుస్థితికి చేరుకుంది.
ఇక వైసీపీ అనుకూల మీడియా విషయానికి వస్తే నిరంతరం వైసీపీ భజన తప్ప ఇంకో మాటే లేదు. ప్రజా సమస్యలపై చర్చే ఉండదు. ఆంధ్రప్రదేశ్ తెలుగు మీడియా ఇంతటి దౌర్భాగ్య స్థితిలో ఉండటం ప్రజల దురదృష్టం అని భావించాలి.చివరకు ప్రజలు ఏ ఛానల్ చూడాలో ఏ పేపర్ చదవాలో తెలియని పరిస్థితి వచ్చింది. నిజాయితీగా కొన్ని సంస్థలు పని చేసినా ఆర్ధిక ఇబ్బందులు వల్ల అవి త్వరగానే మూతపడుతున్నాయి. మీడియా కార్పొరేట్ వర్గాల చేతిలో పావుగా మారితే ప్రజల తరపున మాట్లాడే గొంతుకలు మూతపడే ప్రమాదం ఉంది. ప్రజలు కనీస భావప్రకటనా స్వేచ్ఛ కోల్పోతారు.ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకి అత్యంత ప్రమాదం..