The Highest Temperature : 2023 సంవత్సరంలో సూర్యుడు తన ప్రతాపాన్ని ఎలా చూపించాడో మనమందరం కూడా అనుభవించాం. ఎండవేడికి తట్టుకోలేక అందరూ విలవిల లాడిపోయారు. అధిక ఉష్ణోగ్రత,ఉక్కపోతలతో మనుషులే కాకుండా పశుపక్షాదులు సైతం ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చింది. ఎప్పుడు లేనంత అధిక వేడిని ఈసారి మనం చవిచూసాం.. అధిక ఉష్ణోగ్రతకు నైరుతి రుతుపవనాలు ఆలస్యం తోడవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
ఆలస్యంగా ఋతుపవనాలు వచ్చినప్పటికీ ఆశించినంతగా వర్షాలు కురవకపోవడంతో ప్రజల పరిస్థితి పెనం మీద నుండి పొయిలో పడినట్టుగా అయిపోయింది. అయితే ఈ రకమైన పరిస్థితి గడిచిపోయిన 174 సంవత్సరాల తర్వాత ఈ సంవత్సరం జూన్ నెలలో ఎప్పుడు లేనంతగా అత్యధిక ఉష్ణోగ్రత నమోదైనట్లు నాసా,NOAA ప్రకటించాయి. 20వ శతాబ్దిలో భూమిపై సగటు ఉష్ణోగ్రత 15.05 సెల్సియస్ డిగ్రీలుగా ఉండగా…
ఈ జూన్ నెలలో 1.05 డిగ్రీలు ఎక్కువ ఉష్ణోగ్రత నమోదయింది అని అధ్యయనాలు వెల్లడించాయి. ఇలా ఏక మొత్తంలో 1 డిగ్రీని మించి ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే మొదటిసారి. ఉష్ణోగ్రత పెరగడానికి అసలైన కారణం ఏమిటంటే …ఎల్ నినో కారణంగానే ఈ అత్యధిక ఉష్ణోగ్రత పెరిగిందని నాసా పేర్కొంది. అంటే దీనివల్ల సముద్ర జలాలు వేడెక్కి ప్రపంచ వాతావరణన్ని మారుస్తుందని నాసా తెలిపింది.
నైరుతి రాకతోను దేశవ్యాప్తంగా అంతగా వర్షాలు కురవడం లేదు. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి అత్యంత తక్కువ వర్షపాతం నమోదు కావడం గమనార్హం. ఇలాగే కొనసాగితే రానున్న రోజులాల్లో మానవాళి ఇంకా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.