సీనియర్ నాయకులనూ ఆశ్చర్యపరిచేలా అభివృద్ధి పనులు..
పేటలో ముస్లింమైనారిటీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి తీవ్రంగా శ్రమించిన ఎమ్మెల్యే..
ఈ భారీ ప్రాజెక్టుకు ఎట్టకేలకు కార్యరూపం..
సీఎం వైఎస్ జగన్ అండతో పేట ప్రజలకు మేలు చేసే దిశగా రజిని..
ఆనందం వ్యక్తంచేస్తున్న ముస్లిం సోదరులు..
చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడదల రజిని వ్యూహాత్మకంగా ముందుకు దూసుకెళ్తున్నారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీ ప్రజలు చాలా ఎక్కువ. చిలకలూరిపేట పట్టణంలో నాలుగింట ఒక వంతు ముస్లింలే ఉంటారు. ఈ వర్గం వారికి మేలు చేసే దిశగా ఎమ్మెల్యే ఒక పెద్ద ప్రాజెక్టును చిలకలూరిపేటకు తీసుకురావడానికి కలలుకన్నారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అండతో ఎట్టకేలకు ఆ ప్రాజెక్టును సాధించారు. అధికారుల వెంటపడి మరీ స్థల సేకరణ కూడా పూర్తి చేయించారు. ఇక నిర్మాణమే తరువాయి.
విషయం ఏంటంటే..?
చిలకలూరిపేట నుంచి గత ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరఫున బరిలో నిలిచిన ఎమ్మెల్యే విడదల రజిని.. అప్పట్లోనే ముస్లింలు బాగా వెనుకబడి ఉంటాన్ని గమనించారు. ముఖ్యంగా ముస్లిం బాలికల విద్య గురించి ఆలోచించారు. చిలకలూరిపేట పట్టణంలో ముస్లిం మైనారిటీ బాలికల కోసం ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలను నిర్మించగలిగితే ఆ వర్గం వారికి పెద్ద ఊరట లభిస్తుందని భావించారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అండతో చిలకలూరిపేటకు ముస్లిం మైనారిటీ బాలికల కోసం ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలను సాధించుకున్నారు. ఉత్తర్వులు వచ్చిందే తడవుగా పాఠశాల నిర్మాణానికి కావల్సిన స్థల సేకరణ కోసం అధికారులతో పరుగులు పెట్టించారు.
560 మంది విద్యార్థినులకు ఉచితంగా చదువుకునే అవకాశం
ప్రభుత్వ ముస్లిం మైనారిటీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల ద్వారా ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ముస్లిం విద్యార్థినులకు ఉచితంగా చదువు చెబుతారు. క్యాంపస్‌లోనే భోజన, వసతి సదుపాయాలు ఉంటాయి. విద్యార్థినులకు ప్రభుత్వమే పౌష్టికాహారాన్ని అందిస్తుంది. ఒకటి నుంచి పదో తరగతి వరకు విద్యార్థినులు ఉచితంగా హాస్టల్లో ఉండి నాణ్యమైన విద్యను పొందుతారన్న మాట. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రూ.18 కోట్ల నిధులు కేటాయించింది.
జాతీయ రహదారి వెంట అత్యంత ఖరీదైన ప్రభుత్వ స్థలంలో నిర్మాణం
ఈ పాఠశాల నిర్మాణం కోసం ఎమ్మెల్యే గతంలో పలు ప్రాంతాల్లో స్థలాలను పరిశీలించారు. నాదెండ్ల మండలం ఇర్లపాడు, నాదెండ్ల, చిలకలూరిపేట రూరల్ మండలం కమ్మవారిపాలెం, తాతపూడి, యడ్లపాడు మండలం గుత్తావారిపాలెం, యడ్లపాడు తదితర గ్రామాల్లో స్థలాలు పరిశీలించారు. అయితే తాతపూడి రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ స్థలం అనువైనదిగా ఎమ్మెల్యే భావించి, ఆ స్థలాన్ని బాలికల పాఠశాల కోసం వినియోగించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. రెవెన్యూ అధికారులను ఫైల్ తయారుచేయాల్సిందిగా సూచించారు. అధికారులు సంబంధిత ఫైలు రెడీ చేయడం, దాన్ని ముస్లిం వెల్ఫేర్ విభాగానికి బదలాయిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. ఈ తతంగం మొత్తం పూర్తయ్యేవరకు ఎమ్మెల్యే అధికారులను పరుగులు పెట్టించారు. పాఠశాల నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభమయ్యేలా శాసనసభ్యురాలు రజిని ప్రతేక చొరవ చూపుతున్నారు. ఆ దిశగా అధికారులతో నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు.
ముస్లిం వర్గాల్లో సంతోషం
జాతీయరహదారిని అనుకుని చిలకలూరిపేటకు కూతవేటు దూరంలో అత్యంత విలువైన భూమిలో పాఠశాలను నిర్మిస్తున్నందుకు చిలకలూరిపట నియోజకవర్గంలోని ముస్లిం వర్గాల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. జాతీయరహదారిని అనుకుని మొత్తం నాలుగున్నర ఎకరాలు ఈ పాఠశాల నిర్మాణం కోసం కేటాయించారు. అక్కడ ఎకరం పొలం విలువ రూ.కోటిన్నర ఉంటుందని, దాదాపు రూ.6 కోట్ల విలువైన స్థలాన్ని ముస్లిం విద్యార్థినుల కోసం కేటాయించడం తమకు ఎంతో గర్వకారణమని ముస్లిం పెద్దలు చెబుతున్నారు. ఇతర ప్రజాప్రతినిధులు అయితే అంత ఖరీదైన స్థలాన్ని ఎలా ఆక్రమించుకుందామా.. అని చూసేవారని, తమ ఎమ్మెల్యే ముస్లింల సంక్షేమం కోసం కేటాయించేలా చేశారని సంతోషం వ్యక్తంచేస్తున్నారు.
