World Music Day : సంగీతానికి రాళ్లను కరిగించే శక్తి ఉందంటారు. నిజానికి సంగీతానికి రాళ్లు కరుగుతాయో లేదో కానీ మనసు మాత్రం ఇట్టే కరిగిపోతుంది. మనలో ఒక్కొక్కరు ఒక్కో రకమైన Music ని ఇష్టపడతారు. కొందరు Melodies ని ఇష్టపడితే, మరికొందరు Fast Beat ని ఇష్టపడతారు. ఇంకొందరు భక్తి గీతాలను, విప్లవ గీతాలను ఇష్టపడతారు. మొత్తానికి ఎవరికి నచ్చిన మ్యూజిక్ ని వాళ్ళు వింటూ రిలాక్స్ అవుతుంటారు. సంగీతం అనేది శబ్ధాన్ని కాలంతో మేళవించి వినసొంపుగా మార్చే ఓ విలక్షణమైన ప్రక్రియ.
Music అనే పదం గ్రీకు భాష Muses నుంచి వచ్చింది. మ్యూజిక్ యొక్క లక్షణాలు మనం ఉండే ప్రాంతం, సంస్కృతి, సంప్రదాయాలను బట్టి మారుతుంది. మనం సంతోషంగా ఉన్నా.. బాధలో ఉన్నా సంగీతం ద్వారానే సేద తీరుతుంటాం. ఇంట్లో గానీ ఆఫీస్ లో గానీ ఏ చిన్న పార్టీ అయినా సరే మ్యూజిక్ ఉండి తీరాల్సిందే.. పెళ్లిల్లలో మ్యూజిక్ గురించైతే ఎంత చెప్పుకున్నా తక్కువే.. ఇంకా సినిమాల్లో మ్యూజిక్ పాత్ర మాములుగా ఉండదు. కేవలం మ్యూజిక్ ద్వారానే హిట్ అయిన సినిమాలు అనేకం.
డాక్టర్స్ సైతం మ్యూజిక్ ను ట్రీట్మెంట్ గా వాడుతుంటారు. మ్యూజిక్ థెరపీకి ప్రపంచవ్యాప్తంగా మంచి ఫలితాలు వస్తున్నాయి. మనదేశంలో కరోనా రెండవ వేవ్ లో.. అంటే ఏప్రిల్-మే నెలల్లో, ఉదయపూర్ లోని రవీంద్ర నాథ్ మెడికల్ కాలేజీలోని కరోనా వార్డులో 150 మందికి పైగా తీవ్రమైన రోగులను చేర్చారు. ఆ రోగులు ఉద్రిక్తంగా, ఉద్వేగంతో ఉండేవారు. దీంతో డాక్టర్స్ ‘మ్యూజిక్ థెరపీ’ ప్రారంభించారు. అప్పట్నుంచి రోగులకు మంచి నిద్ర రావడం ప్రారంభమైంది.
అలాగే వారి BP కూడా మెరుగుపడింది. పెద్ద పెద్ద గోశాలల్లో కూడా పాల ఉత్పత్తిని పెంచడానికి మ్యూజిక్ ని ఉపయోగిస్తుంటారు. సోమయాజులు, మంజు భార్గవి లాంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ లను ప్రధాన పాత్రధాలుగా పెట్టి సంగీతం ప్రధాన అంశంగా 40 ఏళ్ళ క్రితం తీసిన శంకరాభరణం ఎంత పెద్ద హిట్టో మనకు తెలిసిందే ఆ సినిమా గురించి మనం ఇప్పటికీ మాట్లాడుకోడానికి కారణం ముఖ్యంగా ఆ సినిమాలోని సంగీతం, సంగీతం చుట్టూ అల్లుకున్న ఆ పాత్రలు.
సాధారణంగా చివరి దశలో, అల్జీమర్స్ రోగులు స్పందించరు కానీ మీరు హెడ్‌ఫోన్‌ల సహాయంతో వారికి ఇష్టమైన సంగీతాన్ని వినిపించినట్లయితే వారి కళ్ళలోకి జీవం రావడమే కాకుండా, వారు కదలడం మరియు కొన్నిసార్లు పాడటం ప్రారంభిస్తారు. మీరు సంగీతాన్ని ఆపివేసిన తర్వాత కూడా దీని ప్రభావం 10 నిమిషాలు ఉండవచ్చు అని పరిశోధనల్లో తేలింది. ఇటీవలి అధ్యయనాలలో, మతిస్థిమితం కోల్పోయిన వారు సంగీతానికి బాగా స్పందిస్తారని కనుగొన్నారు. మీరు వారికి ఇష్టమైన సంగీతాన్ని వినిపిస్తే, మెదడులోని వివిధ భాగాలు చైతన్యవంతమవుతాయి.
అంటే సంగీతంతో సంబంధం ఉన్న జ్ఞాపకాలు భావోద్వేగ జ్ఞాపకాలు, అవి ఎప్పటికీ మసకబారవు. అల్జీమర్స్ రోగులు కూడా సంగీతానికి స్పందించడానికి కారణం ఇదే. అంతేకాదు సంగీతం ఒంటరితనాన్ని దూరం చేస్తుంది. మనం ఎప్పుడైనా ఒంటరిగా ఉన్నప్పుడు మన మనసుకు నచ్చిన పాటలు వింటూ రిలాక్స్ అవుతాం. రోజంతా వర్క్ చేసి అలసిపోయి ఇంటికి వచ్చినప్పుడు మ్యూజిక్ మన మీద మెడిసిన్ లా పని చేస్తుంది. అందుకే ప్రపంచం మొత్తం భాషతో సంబంధం లేకుండా సంగీత సాగరంలో మునిగి తేలుతుంది.