YS Jagan Stickers: జగనన్న స్టిక్కర్లు.. ముందు ముందు పచ్చ బొట్లే అని ట్రోలింగ్..
ఏపీ సియం జగన్ మోహన్ రెడ్డి ఈ మధ్య కొత్త ఆలోచనకి శ్రీకారం చుట్టడం చర్చనీయాంశం అయింది..ఆయన ప్రవేశ పెట్టిన నవరత్నాలు కావొచ్చు లేదా సంక్షేమ పథకాలు ఇంకేవైనా కావొచ్చు.. వాటి వల్ల లబ్ది పొందినవారు ఎంతమంది అనో..లేక ప్రభుత్వం పట్ల ప్రజల వైఖరి ఎలా ఉంది అని తెలుసుకోవాలనో..లేక తమ ప్రభుత్వానికి ప్రజల్లో సరైన పాజిటివ్ టాక్ రావాలని కూడా అనుకున్నాడేమో ఏమో గానీ.. రాష్ట్రంలో ని ప్రతీ ఇంటికి ఇక “మా నమ్మకం నువ్వే జగనన్న” అనే స్టిక్కర్ లు అంటించాలని నిర్ణయం తీసుకున్నారు.
అయితే ఇప్పటికే గుడి, బడి అని చూడకుండా ఆఖరికి సమాధులని కూడా వదలకుండా వైసీపీ రంగులు వేస్తున్నారు అని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తుంటే.. ఇప్పుడు ఈ స్టిక్కర్లు అంటూ జగన్ ఆదేశాలు ఇవ్వడం పెద్ద చర్చకే దారి తీసింది. స్టిక్కర్ల పథకం వెనుక కారణాలు ఏమైనా.. ఈ ప్రయత్నం వల్ల అటు ప్రతిపక్షాలు మాత్రమే కాకుండా సొంత పక్షం నుండి కూడా విమర్శలు మొదలవుతున్నాయి.
ఇప్పటికే అప్పుల్లో ఉన్న రాష్ట్రం.. పైగా 15 తారీఖు వస్తే కానీ ప్రభుత్వ ఉద్యోగులకి జీతం రాని పరిస్థితుల్లో ఇలా స్టిక్కర్ల పేరిట ప్రజాధనం వృథా చేయడం ఏంటనే వాదనలు తెరపైకి వస్తున్నాయి.. నిజానికి ప్రభుత్వ పథకాల వల్ల లబ్ది పొందిన వారు ఆ మేలు గుర్తుపెట్టుకుంటారు కదా.. ఇలా స్టిక్కర్ల రూపంలో ఎందుకు..? అలాగే గతంలో చంద్రబాబు కూడా అప్పడాలపై.. బెల్లం సంచులపై తన బొమ్మ వేసుకొని విమర్శల పాలు అయిన సంఘటనలు కూడా చూశాం. ఇప్పుడు అదే తప్పు జగన్ చేయడం ఏంటి..? అసలు ఈ స్టిక్కర్లు.. రంగుల రాజకీయం ఏంటా” అని జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు.
పై పెచ్చు సొంత పార్టీ నేతలు కూడా లోలోపల ఇదేం విడ్డూరం.. ఇలా చేస్తే మంచి కన్నా పార్టీకి చెడ్డపేరే అధికం అని లోలోపల అనుకుంటున్నారట. ఇక వైసీపీ సోషల్ మీడియా సంగతి ససరేసరి. ప్రతిపక్షాల తో పాటు సొంత పార్టీ అభిమానులు కూడా “గతంలో బాబు అప్పడాలపై బొమ్మల వ్యవహారం పై గట్టిగా నిలదీసి ఎండగట్టిన మనం.. ఇలా మన జగనన్న కూడా ఇంటింటికి స్టిక్కర్లు అని హుకుం జారీ చేస్తుంటే ఎలా..?” అంటూ కక్కలేక మింగలేక తమలో తాము తలలు పట్టుకుంటున్నారట. ఇలాగే పోతే రానున్న రోజుల్లో జగనన్న పచ్చబొట్లు అంటూ మన కాళ్ళు వేళ్ళపై కూడా పచ్చబొట్టు వేసేలా ఉన్నాడు అంటూ తెగ ట్రోల్స్ చేయడం గమనార్హం.
పైకి మాత్రం ఇంటి యజమాని అనుమతి ఉంటేనే స్టిక్కర్లు ఆతికిస్తాం అని ప్రభుత్వం చెపుతున్నప్పటికి..స్టిక్కర్లు అంటించుకోని ఇళ్ళకి ఏదో ఒక రూపంలో సాకు వెతుక్కొని మరీ ప్రభుత్వ పథకాలు కట్ చేస్తారని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.. పైగా జగన్ వాలకం చూస్తుంటే తన నీడని తానే నమ్మలేని స్థితిలోకి వెళ్ళారనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.. అందుకు ఈ మధ్య తన సొంత ఎమ్మెల్యే కోటంరెడ్డి పై జరిగిన ఫోన్ టాపింగ్ వ్యవహారమే పెద్ద ఉదాహరణ అంటున్నారు మేధావులు.
ఏదేమైనా ఈ స్టిక్కర్ల రాజకీయం పై ఇంటా భయట విమర్శలు వ్యక్తం కావడం చూస్తుంటే.. మున్ముందు ఏపీ రాజకీయం లో ఇంకెన్ని చూడాలో అనే ఆలోచనలు రావడం సహజమే సుమీ..