డిసెంబర్ నెల ముగియబోతుంది. మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం.. అయితే వచ్చే నెలలో చాలా బ్యాంకులకు సెలవులు ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. నగదు లావాదేవీల నుంచి చెక్కులు, డ్రాఫ్ట్‌లు జమ చేయడం వరకు అనేక పనుల కోసం బ్యాంకులను సందర్శించాల్సిన వారు సెలవుల తేదీలను గుర్తుపెట్టుకోవాలి. ప్రజల సౌకర్యార్థం, భారతీయ రిజర్వ్ బ్యాంక్ బ్యాంకు సెలవుల జాబితాను జారీ చేస్తుంది. ఆర్బీఐ కొత్త సంవత్సర క్యాలెండర్ ప్రకారం.. జనవరి 2023లో మొత్తం 14 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి.
జనవరి నెలలో బ్యాంక్‌కు సంబంధించిన ముఖ్యమైన పనులు ఉంటే.. ముందుగానే దాన్ని పూర్తి చేసుకోవడం మంచిది. జనవరిలో ఆరు వీకెండ్ సెలవులు ఉన్నాయి. 1, 8, 15, 22, 29న ఆదివారాలు వచ్చాయి. 14, 21న రెండు, నాలుగో శనివారాలు. జనవరి 1, 2, 5, 8, 11, 14, 15 తేదీల్లో కొత్త ఏడాది వేడుకలు, గురు గోబింద్ సింగ్ జయంతి, మిషనరీ డే, మకర సంక్రాంతి సందర్భంగా ఆయా రాష్ట్రాల్లో సెలవులు ఉన్నాయి.
జనవరి 22, 23, 25, 26, 28, 29, 31న నేతాజీ జయంతి, హిమాచల్ ప్రదేశ్ అవతరణ, గణతంత్ర దినోత్సవం, మె దామ్ మె ఫి కారణంగా సెలవులు వచ్చాయి. ఆర్‌బీఐ ప్రకారం రాష్ట్రాలను బట్టి సెలవులు ఉంటాయి. నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్ యాక్ట్, ఆర్టీజీఎస్, బ్యాంక్స్ క్లోజింగ్ అకౌంట్స్ చట్టాల ప్రకారం సెలవులు ఇస్తారు. బ్యాంకు సెలవులు రాష్ట్రాలు, ప్రాంతాలను బట్టి మారుతుంటాయి. కొన్ని సెలవులు మాత్రం దేశ వ్యాప్తంగా ఒకేలా ఉంటాయి.
