Manchu Manoj : ఇంతకాలం గుట్టుగా ఉన్న మంచు ఫ్యామిలీ విభేదాలు వీధిన పడుతున్నాయి. దీంతో మోహన్ బాబు రంగంలోకి దిగి వ్యవహారాలు చక్కదిద్దాల్సి వచ్చింది. చాలాకాలంగా మంచు ఫ్యామిలీకి మనోజ్ దూరంగా ఉంటూ వస్తున్నాడు. కొన్నాళ్ళు అక్క మంచు లక్ష్మీ ఇంట్లో ఉండగా, ఇంకొన్నాళ్ళ చెన్నయ్ లో ఉన్నాడు. ఇటీవల మనోజ్ రెండో పెళ్లి చేసుకున్నపుడు ఈ విబేధాలు స్పష్టంగా కనిపించాయి. అక్కే పెళ్లి వ్యవహారాలన్నీ చూసిందని మనోజ్ చెప్పడం గమనార్హం.
అయితే తాజా పరిణామంతో ఈ విభేదాలు తారాస్థాయికి చేరాయని అర్థం అవుతుంది. మోహన్ బాబు సమీప బంధువు సారథి.. విష్ణు ఫిల్మ్ కెరీర్ ప్రారంభం నుంచి.. అతని వెన్నంటే ఉంటున్నారు. ఇటీవల కాలంలో విష్ణుకు దూరంగా జరిగి.. మనోజ్‌కు సారథి దగ్గరయ్యారు. తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నాడని రాత్రి సారథి ఇంటికి వెళ్లాడు విష్ణు. ఆగ్రహంతో రగిలిపోతూ సారథిపై విష్ణు దాడి చేశాడు. విష్ణు తన వెంట పడకుండా..
ఇంటి బయట గొళ్లెం పెట్టి ఆస్పత్రికి వెళ్లాడు సారథి. ఈ దృశ్యాలన్నీ మనోజ్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. కాగా మోహన్ బాబు వారించడంతో.. ఆ వీడియోను డిలీట్ చేశాడు మనోజ్. అయితే దీనిపై విష్ణు స్పందిస్తూ.. ‘మా ఇద్దరి మధ్య గొడవలు సాధారణమే. అది నిన్న ఉదయం జరిగిన చిన్న ఘటన. మనోజ్ చిన్నవాడు, ఇది స్పందించాల్సినంత పెద్ద విషయం కాదు’ అని విష్ణు వివరణ ఇచ్చారు. కాగా మంచు మనోజ్.. డయల్ 100కి కాల్ చేశాడు. మనోజ్, విష్ణుపై కేసు పెట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.