Rains In Telangana : అకస్మాత్తుగా తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు పంటలు నష్టపోగా, జనావాసం మొత్తం అస్తవ్యస్తంగా మారిపోయింది. ఈ అకాల వర్షాలకు మిర్చి, వేరుశనగ వంటి పంటలు కళ్లాల్లో తడిసి ముద్ద అవడంతో రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తడిసిన పంటను మార్కెట్ యార్డుల్లో ఎవరూ కొనుగోలు చేయరని కష్టపడి పండించిన పంట నీళ్ల పాలు కావడంతో రైతుల బాధ వర్ణనాతీతంగా మారిపోయింది.
ఇప్పటికే తెలంగాణలో కురుస్తున్న వర్షాల కారణంగా జగిత్యాల, సంగారెడ్డి మహబూబ్ నగర్, మెదక్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల ప్రజలు తీవ ఇబ్బందులకు గురవుతున్నారు. ఇంకా మూడు రోజుల వర్ష సూచన తో కాలనీలో ఉండే లోతట్టు ప్రాంత ప్రజలు భయాందోళనలో ఉన్నారు. పిడుగులు, వడగళ్లతో కురుస్తున్న వర్షం కారణంగా చాలా వరకు పంట నష్టం జరిగింది.
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ మండలంలో పిడుగుపాటు వలన గొర్రెల యజమానితో సహా 40కి పైగా గొర్రెలు కూడా చనిపోవడం విషాదకరంగా మారింది. ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రజలందరూ వీలైనంత వరకు తగు జాగ్రత్తలు తీసుకుంటూ, అత్యవసరం అయితేనే ఇళ్ళలోనుండి బయటికి రావాలి అని అధికారులు సూచిస్తున్నారు.
అకాల వర్షాలకు ఫ్లూ వ్యాధులు పెరిగే అవకాశం ఉందని, ఇప్పటికే రాష్ట్రంలో వైరల్ జ్వరాలు, జలుబు, దగ్గుతో అనేకమంది ఆసుపత్రుల పాలవడంతో, కాచి చల్లార్చిన నీటిని తాగడాం మంచిదని వైద్యులు తెలిపారు. ఇది ఇలా ఉండగా ఇంకా మూడు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని మరోవైపు వాతావరణ శాఖ హెచ్చరించింది.
