ఎన్నికల అనంతరం వరస ఎదురు దెబ్బలు తిన్న టిడిపి ఇప్పుడు రాష్ట్ర నాయకత్వంపై, పార్టీ పునర్నిర్మాణంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో వివిధ వర్గాలు దేనికి పార్టీకి దూరమయ్యాయనే అంశంపై సమగ్రమైన చర్చ చేసిన తర్వాత.. పార్టీలో పనిచేయని కొందరు నేతలని పార్టీ భాద్యతల నుంచి తొలగించి, ఉత్తరాంధ్ర నుంచి బలమైన బిసి సామాజిక వర్గానికి చెందిన నేతను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నియమించే అవకాశాలు ఉన్నట్టు చెబుతున్నారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత మొట్టమొదటిసారిగా బీసీలు టిడిపికి కొంచెం దూరమైన మాట గమనించిన టీడీపీ అధిష్టానం తమ పార్టీకి అండగా ఉండేటువంటి బీసీ సామాజికవర్గం తిరిగి ఆకర్షించే పనిలో పడ్డారు.
కింజరాపు అచ్చెన్ననాయుడు దీనికి తగిన వ్యక్తి అని చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై భిన్నమైన వాదనలు వున్నా అధినేత ఆపేరునే ఖరారు చేసిచేసినట్టు తెలిసింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కింజరాపు అచ్చెన్నాయుడు పై ఇప్పటికే వివిధ కేసులు ఉన్నందున ఆయన్ని టిడిపి అధ్యక్షుడిగా నియమించడం పట్ల కొంతమందిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి ఒక తాత్కాలికమైన అధ్యక్షుడిగా ఎవరిని నియమించినా వారి పాత్ర కేవలం ఉత్సవ విగ్రహం అనీ… పార్టీని ముందుకు నడిపించడానికి చంద్రబాబు నాయుడు లోకేష్ ప్రత్యక్షంగా రాజకీయ పోరాటాలు చేయాలనీ.. అలా కాని పక్షంలో పార్టీ కేడర్లో చైతన్యం వచ్చే అవకాశం లేనేలేదని ఆ పార్టీ సీనియర్ నాయకుల అభిప్రాయం. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ కార్యకర్తలు ప్రస్తుతానికి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనకపోవడం వల్ల ప్రతి నియోజకవర్గంలో కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేసి పార్టీకి నూతనోత్సాహాన్ని నింపడానికి చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా అచ్చెన్నాయుడు నాయకత్వంపై టిడిపి లోని ఇతర సీనియర్ నాయకులు పూర్తి స్థాయిలో సంతృప్తి లేరని ఒక వర్గం అభిప్రాయపడుతోంది. అధికారంలో ఉన్నంత కాలం ఒంటెత్తు పోకడలతో పార్టీని నడిపించిన కొంతమంది ఇప్పుడు పార్టీ కష్టకాలంలో మొహం చాటేయడంతో కొన్ని మార్పులు అనివార్యం అని భావించిన చంద్రబాబు నాయుడు ఈసారి అత్యంత విశ్వాసపాత్రులకి ఇచ్చే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. వ్యూహాత్మకంగా ఆయన నారా లోకేష్ ని అన్ని జిల్లాల్లో పర్యటనలు చేయించడం ద్వారా కార్యకర్తలకి పార్టీకి మధ్య ముందు ఒక అవినాభావ సంబంధాన్ని ఏర్పాటు చేసి ఎన్నికల నాటికి సమర్థవంతమైన నాయకుల్ని బరిలో దింపి మెరుగైన ఫలితాల కోసం ప్రయత్నం చేస్తే పూర్వ వైభవం సాధించడం కష్టమేమీ కాదని టిడిపిలో కొంతమంది అభిప్రాయపడుతున్నారు. పార్టీ నాయకత్వం మార్పుతోనే పార్టీలో పెనుమార్పులు సంభవించని అన్ని జిల్లాల నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు, శాసనసభ్యులు చిత్తశుద్ధితో పనిచేస్తేనే పార్టీకి పునర్ వైభవం వచ్చే అవకాశం ఉందని వారు గంటా పథంగా చెబుతున్నారు రానున్న రోజుల్లో అధ్యక్ష స్థానం మార్పు పార్టీ లో జరగబోయే మార్పులు ఏ పరిణామాలకు దారి తీస్తుందో తెలియాలంటే కొన్నాళ్లు వేచి చూడాలి.
