Chiranjeevi: విజయ్ ర్యాలీలో తొక్కిసలాటపై చిరంజీవి స్పందన.. మృతులకు ప్రగాఢ సానుభూతి
Chiranjeevi: తమిళనాడులోని కరూర్‌లో తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు, ప్రముఖ నటుడు విజయ్ నిర్వహించిన భారీ ర్యాలీలో చోటుచేసుకున్న తొక్కిసలాట దేశవ్యాప్తంగా విషాదం నింపింది. ఈ ఘటనపై తెలుగు చిత్ర పరిశ్రమ సీనియర్ నటుడు మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఆయన ఎక్స్ ద్వారా స్పందించారు. “తమిళనాడులోని కరూర్ ర్యాలీలో జరిగిన విషాదకరమైన తొక్కిసలాట తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ క్లిష్ట సమయంలో వారికి బలం చేకూరాలని కోరుకుంటున్నాను. అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను” అని చిరంజీవి పేర్కొన్నారు.
ఈ దుర్ఘటనలో 39 మందికి పైగా మరణించగా, వారిలో ఎనిమిది మంది చిన్నారులు, 16 మందికి పైగా మహిళలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరో 400 మందికి పైగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అనూహ్యంగా చోటుచేసుకున్న ఈ విషాదం విజయ్ అభిమానులతో పాటు రాజకీయ వర్గాలను కూడా కలచివేసింది. ఈ ఘటనపై పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, ఈ ఘటనపై తమిళనాడు ప్రభుత్వాన్ని కేంద్ర హోంశాఖ పూర్తిస్థాయి నివేదిక కోరింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వయంగా ముఖ్యమంత్రి స్టాలిన్‌తో మాట్లాడి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర మంత్రి ఎల్. మురుగన్ ఆసుపత్రుల్లోని బాధితులను పరామర్శించి, మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం స్టాలిన్ మాట్లాడుతూ, తమిళనాడు చరిత్రలో ఒక రాజకీయ పార్టీ నిర్వహించిన కార్యక్రమంలో ఇంతమంది చనిపోవడం ఇదే మొదటిసారి అని చెప్పారు. లక్ష మందికి పైగా కిక్కిరిసిన ఈ సభలో ఏర్పాట్లపై ఇప్పటికే అధికారులు విచారణ ప్రారంభించారు. ఈ విషాద ఘటనకు దారితీసిన కారణాలపై దర్యాప్తు జరుగుతోంది.
