Vizag Sri Erukumamba Temple : మనం ఆలయానికి దైవదర్శనం కోసం వెళ్తాం. ఆలయంలోపల దేదీప్యమానంగా వెలిగిపోతున్న అమ్మవారినీ లేక ఆ దేవుడినీ దర్శించుకుంటాం. కానీ ఇక్కడి ఆలయంలో అమ్మవారికి శిరస్సు ఉండదు. శిరస్సులేని అమ్మవారికి నిత్యం పూజలు జరుగుతూ ఉంటాయి. అవును మీరు విన్నది నిజమే. ఆ శిరస్సులేని అమ్మవారి ఆలయం మరెక్కడో కాదు మన ఇండియాలోని వైజాగ్ నగరంలో ఉంది. అమ్మవారు అలా ఉండడానికి వెనుక గల రహస్యం ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
విశాఖపట్నంలోని ఎరుకమాంబ ఆలయంలో అమ్మవారి విగ్రహానికి శిరస్సు ఉండదు. ఆ స్థానంలో ఓంకారం కనిపిస్తుంది. మరి ఆ విగ్రహానికి తల ఉండదా? అని అడిగితే ఉంటుంది. కానీ ఆ తల అమ్మవారి పాదాల దగ్గర ఉంటుంది. ఇక్కడ అమ్మవారికి బిందెడు పసుపు నీళ్లు సమర్పించుకుంటే భక్తుల కోరికలు నెరవేరుతాయనీ అక్కడి వారి ప్రగాఢ విశ్వాసం.
ఆ ఆదిపరాశక్తి ఎన్నో రూపాలలో ఈ నేల మీద కొలువైంది. ఒక్కోచోట ఒక్కో రూపంలో ఆమె వెలిసింది. మరికొన్ని ప్రాంతాల్లో స్వయంభువుగా అవతరించి భక్తుల కోరికలు తీరుస్తుంది. అయితే విశాఖలోని దుండపర్తి లో ఉన్న శ్రీ ఎరుకుమాంబ అమ్మవారు విశాఖ వాసులకు, ఉత్తరాంధ్రవాసులకు కూడా చాలా సెంటిమెంట్ గల దేవత.
అమ్మవారి శిరస్సు వెనుక ఒక రహస్యం, ఒక కథ దాగి ఉంది. ఒకప్పుడు రైల్వే స్టేషన్ పక్కన గల వైర్లెస్ కాలనీలో అమ్మవారీ ఆలయం ఉండేది. ఆ ఆలయంలో అమ్మవారూ నిత్యం పూజలు అందుకునేవారు. అయితే రైల్వే స్టేషన్ నిర్మాణ సమయంలో ఆ గ్రామాన్ని వదిలి అందరూ వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పుడు అమ్మవారు స్థానికుల కలలో కనిపించి తనని
అక్కడి నుంచి తీసుకెళ్లి ఆలయ నిర్మాణం చేపించాలని చెప్పిందని అక్కడి ప్రజలు చెబుతుంటారు. అలా అమ్మవారి విగ్రహాన్ని ఎద్దుల బండి మీద నుంచి తీసుకెళ్తుండగా ఓ దగ్గర బండి ఆగిపోవడంతో అమ్మవారి విగ్రహం నుంచి శిరస్సు వేరుపడిందంట.. దాంతో కంగారు పడిపోయిన ఆ గ్రామస్తులు తిరిగి ఆ శిరస్సును విగ్రహానికి అతికించాలని చూస్తే ఎంతకీ ఆ శిరస్సు విగ్రహానికి అంటుకోలేదంట..
అప్పుడు ఆ గ్రామస్తులు అందరూ తమకు ఎటువంటి కీడు జరుగుతుందో అని చాలా భయందోనలకు గురయ్యారంట. తమ భయాన్ని అమ్మవారి ఎదుట మొరపెట్టుకోగా, తన కాళ్ల దగ్గర శిరస్సు పెట్టి కంఠం దగ్గర పసుపు నీళ్లు పోస్తే చాలు చల్లని దీవెన అందిస్తానని చెప్పిందంట అమ్మవారు. ఇక అప్పటినుంచి భక్తులు అందరూ బిందెడు పసుపు నీళ్లను సమర్పించుకుంటూ అమ్మవారి దీవెనలను పొందుతున్నారు.