Honeymoon in Shillong: హనీమూన్ హత్య కేసుపై సినిమా.. డైరెక్టర్ ఎవరంటే..?
Honeymoon in Shillong: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ ‘హనీమూన్ హత్య’ కేసు ఇప్పుడు వెండితెరపై సినిమాగా రూపుదిద్దుకోనుంది. బాలీవుడ్ దర్శకుడు ఎస్పీ నింబావత్ ఈ కేసు ఆధారంగా ‘హనీమూన్ ఇన్ షిల్లాంగ్’ పేరుతో చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు. మృతుడు రాజా రఘువంశీ కుటుంబ సభ్యులు కూడా దీనికి అంగీకరించినట్లు తెలుస్తోంది.
రాజా రఘువంశీ సోదరుడు సచిన్ రఘువంశీ మీడియాతో మాట్లాడుతూ, “మా సోదరుడి మృతిని వెండితెరపైకి తీసుకురావడానికి మేము అంగీకరించాము. ఈ కథ ద్వారా ప్రజలకు నిజం తెలుస్తుందని, ఎవరు తప్పు చేశారు, ఎవరు సరైనవారు అనే విషయం వారికి అర్థమవుతుందని మేము నమ్ముతున్నాము” అని పేర్కొన్నారు. దర్శకుడు ఎస్.పి. నింబావత్ మాట్లాడుతూ, “భవిష్యత్తులో ఇలాంటి దారుణాలు జరగకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ సినిమాను రూపొందిస్తున్నాము.
స్క్రిప్ట్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. చిత్రంలో 80 శాతం షూటింగ్ ఇండోర్‌లో, మిగిలిన 20 శాతం మేఘాలయలో జరుగుతుంది” అని తెలిపారు. అయితే, ఈ చిత్రంలో నటించే నటీనటుల వివరాలను మాత్రం ఆయన ఇంకా వెల్లడించలేదు. నింబావత్ గతంలో పలు హిందీ సినిమాలకు నిర్మాతగా, రచయితగా పనిచేశారు. 2018లో ‘కబడ్డీ’ చిత్రానికి దర్శకత్వం వహించారు.
హనీమూన్ మర్డర్ కేసు ఏంటంటే..?
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీ.. ఈ ఏడాది మే 11న సోనమ్‌ను వివాహం చేసుకున్నాడు. మే 20న నవదంపతులు హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లారు. ఆ తర్వాత వారు అదృశ్యమయ్యారు. మే 31న, నవదంపతులు అదృశ్యమైన 11 రోజుల తర్వాత, రాజా రఘువంశీ మృతదేహాన్ని సోహ్రాలోని ఒక జలపాతం సమీపంలోని లోయలో పోలీసులు గుర్తించారు. అతని శరీరంపై కత్తి గాయాలు ఉండటంతో పోలీసులు దీనిని హత్యగా భావించి విచారణ ప్రారంభించారు.
అనంతరం సోనమ్ కోసం గాలించగా, జూన్ 7న ఆమె ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో ప్రత్యక్షమైంది. పోలీసుల విచారణలో, ఆమె తన ప్రియుడు రాజ్ కుష్వాహాతో కలిసి భర్తను హత్య చేసినట్లు తేలింది. దీంతో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఈ కేసు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
