Nadendla Manohar : తూర్పుకాపులకు రాజకీయ సాధికారిత అవసరం. కొంతమంది స్వార్ధ రాజకీయాలకు ఆ వర్గం ఇబ్బందుల పాలవుతూ, సంక్షేమ పలాలకు దూరం అవుతుంది. ఇప్పటివరకు ఓటు బ్యాంకు రాజకీయాలకు మాత్రమే ఉపయోగించుకొని కొందరు లాభపడ్డారు తప్ప సామాజికవర్గానికి చేసిన మేలు ఏమీ లేదని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు పేర్కొన్నారు. తూర్పుకాపులు ఒక్క ఉత్తరాంధ్ర జిల్లాలకే పరిమితం కాలేదని, రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి ఉన్నారని అన్నారు.
శుక్రవారం తణుకు నియోజకవర్గ తూర్పుకాపు సంఘ నాయకులు ఆధ్వర్యంలో ఇతర పార్టీల నుంచి భారీగా తూర్పుకాపు యువత మనోహర్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. వారందరికీ పార్టీ కండువాలు కప్పి మనోహర్ గారు పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు ఉన్నతమైన, వాటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. తూర్పుకాపులు అంటే కష్టించే వ్యక్తులు.
ఎక్కడో ఉత్తరాంధ్ర నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు వలసలు వెళ్లి అక్కడ ఉన్న సామాజికవర్గాలతో కలసిమెలసి జీవించే మనస్తత్వం ఉన్నవారు. తూర్పుకాపు సంక్షేమ సంఘం నుంచి చంద్రశేఖర్ గారు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని, నన్ను కలిసినప్పుడు మీ సమస్యలు ఇంతవరకు నాయకులు ఎందుకు పరిష్కరించలేకపోయారని అడిగి తెలుసుకున్నాం. దీనిపై గత మూడు నెలలు పాటు తూర్పు కాపుల సమస్యలపై అధ్యయనం చేశాం.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తూర్పు కాపులను సమాయత్తం చేసి ఒక వేదికపైగా తీసుకురావాలని పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ప్రయత్నాన్ని మనమంతా అభినందించాలి. తూర్పు కాపుల్లో రాజకీయ వెనకబాటుతనం ఉంది. రాజకీయ ప్రస్థానంలో అందర్నీ కలుపుకొని ముందుకు వెళతాం. ఇతర పార్టీ నాయకుల్లా మాట ఇచ్చి మిమ్మల్ని మోసగించే వ్యక్తులం కాదు. మాట ఇచ్చామంటే దానికి కట్టుబడి పనిచేస్తాం. ఎలక్షన్ కోసమో, రాజకీయలబ్ది కోసమో జనసేన పార్టీ ఎప్పుడు మాట ఇవ్వదు.
సమాజానికి రాష్ట్రానికి ఉపయోగపడుతుంది అని నమ్మితేనే మాట ఇస్తాం. తూర్పు కాపులకు భవిష్యత్తులో ఏ సమస్య వచ్చినా జనసేన పార్టీ అండగా ఉంటుంది. తూర్పు కాపులు ఓబీసీ సర్టిఫికెట్ల కోసం ఇబ్బందులు పడుతున్నారని తెలిసింది. మన ప్రభుత్వం రాగానే దానిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటాం అన్నారు.