Pawan Kalyan in SP Office : ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. అది పౌరులకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు.. ప్రజలు తమ సమస్యలు మీద, ప్రభుత్వ విధానాల మీద బహిరంగంగా తమ నిరసనను శాంతియుతంగా తెలియజేయొచ్చు. క్రమశిక్షణగా నిరసన తెలిపే ప్రజలకు పోలీసులు తగు విధమైన రక్షణ ఇవ్వాలి తప్ప, ఇష్టానుసారం దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేసే అధికారం లేదని పవన్ కళ్యాణ్ అన్నారు.
ఇటీవల శ్రీకాళహస్తిలో జన సైనికుడు కొట్టి సాయి శాంతియుతంగా నిరసన కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో… శ్రీకాళహస్తి ఒకటో పట్టణ సీఐ శ్రీమతి అంజుయాదవ్ విచక్షణారహితంగా ప్రవర్తించి, దాడి చేసిన ఘటనపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం విదితమే. స్వయంగా సాయికి మద్దతుగా తానే పోలీసులతో మాట్లాడేందుకు వస్తానని ప్రకటించిన పవన్ కళ్యాణ్ గారు సోమవారం తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డిని స్వయంగా కలిసి వినతిపత్రం అందజేశారు.
ఆయన వెంట పార్టీ పీఏసీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారు. కొట్టే సాయి శాంతియుత పద్ధతిలో నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలో సీఐ అంజుయాదవ్ చేసిన దాడి ఉపేక్షించరానిదని, ఘటనపై ఉన్న తాధికారులు విచారణ చేసి, తగిన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ ప్రజాస్వామ్యంలో పోలీసులు రాజ్యానికి విధేయులుగా పనిచేయాలి తప్ప, పార్టీలకు కాదని విన్నవించారు.
పోలీసులకు జనసేన పార్టీ పూర్తిగా అన్నివేళలా సహకరిస్తుందని చెప్పారు. పోలీసులు సైతం చట్టాలను, నిబంధనలు పాటించాలని ఎస్పీకి వివరించారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని పవన్ కళ్యాణ్ గారికి ఎస్పీ హామీ ఇచ్చారు. ఇప్పటికే సీఐకు ఛార్జిమెమో ఇచ్చామని, ఆమె సమాధానం తర్వాత శాఖపరమైన చర్యలు ఉంటాయని ఎస్పీ తెలిపారు.
వినతిప్రతం ఇచ్చిన అనంతరం ఢిల్లీ వెళ్లేందుకు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న పవన్ కళ్యాణ్ గారు అక్కడ విలేకరులతో మాట్లాడుతూ..దేశ అత్యున్నత న్యాయస్థానం సైతం పౌరులు స్వేచ్ఛగా నిరసన తెలిపే హక్కు పలు కేసుల్లో భాగంగా వ్యాఖ్యానించింది. న్యాయస్థానం చెప్పిన అంశాలను పోలీసులు పరిగణనలోకి తీసుకోవాలి అని పవన్ వెల్లడించారు.