Varahi VijayaYathra in Eluru : ఏలూరులో ఉన్న పవన్ కళ్యాణ్ గారిని కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని మల్లవల్లి పారిశ్రామికవాడ నిర్వాసితులు కలిసారు. మల్లవల్లి పారిశ్రామికవాడ కోసం సేకరించిన భూములకు సంబంధించి 124మంది రైతులకు ఇప్పటికీ పరిహారం అందించకుండా వేధింపులకు గురి చేస్తున్న తీరు పాలకుల నియంతృత్వ ధోరణికి అద్దంపడుతోందని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అన్నారు.
2016లో పారిశ్రామికవాడ కోసం సేకరించిన 14 వందల ఎకరాల్లో ఇప్పటికీ 302 ఎకరాలకు పరిహారం ఇవ్వకపోవడంతో ఆ భూములపై ఆధారపడ్డ కుటుంబాలు రోడ్డునపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పరిహారం కోసం ప్రజా ప్రతినిధుల చుట్టూ తిరిగితే కులాలవారిగా, ప్రాంతాలవారీగా విడదీసి మాట్లాడటం దురదృష్టకరం అన్నారు అంటూ తమ గోడు వెళ్లబోసుకున్నారు.
తమకు పరిహారం ఇప్పించాలని నిరసన తెలిపితే హత్యాయత్నం కేసులు నమోదు చేసి జైలుకు పంపించారని, తప్పుడు కేసులతో వేధిస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. వారి బాధను చూసిన పవన్ కళ్యాణ్ వెంటనే స్పందిస్తూ..జీవనాధారమైన భూమిని కోల్పోయిన రైతులకు పరిహారం ఇవ్వడం ప్రభుత్వ విధి. పరిహారం అడిగిన రైతులను కులాలు, ప్రాంతాలవారిగా విడదీసి మాట్లాడటం, ఓటు బ్యాంకుగా చూడటం దురదృష్టకరం.
కాయకష్టంతో పంట పండించే రైతుకి కులం అంటగట్టడం ఏమిటి? మల్లవల్లి భూనిర్వాసితులకు జనసేన అండగా నిలుస్తుంది అని పవన్ కళ్యాణ్ వారికి భరోసా కల్పించారు. అన్యాయంగా, ఆకారణంగా కేసులుపెట్టి, దాడి చేసి వేధించడం అమానుషం. వారికి అవసరమైన న్యాయ సహాయాన్ని కూడా అందిస్తాం. క్షేత్ర స్థాయి పరిశీలనకు వెళ్ళి బాధిత రైతులతో సమావేశం నిర్వహిస్తాను. టీడీపీ హయాంలో ఇచ్చారు కాబట్టి మల్లంపల్లి రైతుల పోరాటానికి మద్దతు తెలపాలని చెబుతాను అన్నారు.