అది సినీ పరిశ్రమలో మకుటం లేని మహారాజు లాంటి సీనియర్ హీరో ఇల్లు.. ఇంద్ర భవనం లాంటి ఆ ఇంటి లోపలికి తన మొదటి చిత్రంతోనే ఆకాశాన్ని తాకే సూపర్ హిట్ అందించి రెండవ చిత్రంతో పరిశ్రమకి దిమ్మతిరిగే ప్లాప్ ఇచ్చిన ఓ యువ దర్శకుడు అడుగు పెట్టాడు. కారణం ఏమిటంటే ఆ సీనియర్ హీరో కొడుకు అరంగేట్రం చేసే చిత్రం కోసం కథను వినిపించడానికి.
అక్కడ దాదాపు 2 వందల మంది పైగా ఉన్నారు. ఏదో వేడుక జరుగుతుంది అని మనసులో అనుకుంటూ అడుగుపెట్టిన ఆ దర్శకుడికి ఆహ్వానం పలుకుతూ కూర్చోమని మర్యాద చేశారు అక్కడి వారు. అంత మంది మధ్యలో ఇబ్బందిపడుతూ కూర్చున్నాడు. ఇంతలో ఆ సీనియర్ హీరో మెట్ల పై నుండి కిందకి దిగి వచ్చారు. ఆయన రావడంతో అక్కడ వాతవరణం నిశబ్దంగా మారింది.
ఆ సీనియర్ హీరో వచ్చి అతని ముందు కూర్చుని మర్యాదపూర్వకంగా పలకరించిన తర్వాత కథ చెప్పమని అడిగారు. షాక్ తిన్న అతను.. ‘ఇంత మంది మధ్యలో అంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది సార్’ అన్నాడు. ఏం పర్వాలేదు. ఇది నా వారసుడు అరంగ్రేటం చేసే చిత్రం, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా బంధువులు.. శ్రేయోభిలాషులు.. వాళ్ళకి కూడా కథ నచ్చాలి. మీరేమి నెర్వస్ గా ఫీల్ అవ్వకండి కథ చెప్పండి.
ఏదోలా ధైర్యం తెచ్చుకుని కథ చెప్పడం మొదలు పెట్టిన అతను తనదైన శైలిలో స్టోరీ నెరేట్ చేసి అక్కడున్న వాళ్ల స్పందన కోసం ఎదురు చూస్తున్నాడు.
అక్కడ సూది కిందపడితే వినిపించేంత నిశ్శబ్దం ఆవరించి ఉంది. కథ విని ఎవరు మాట్లాడడం లేదు. ఆ సీనియర్ హీరో లేచి అతని దగ్గరకు వచ్చి ఆలింగనం చేసుకుని కథ చాలా బాగుంది. షూటింగ్ ఎప్పుడు మొదలు పెడదాం అని అడిగారు. ఆ సీనియర్ హీరో మరెవరో కాదు స్మగ్లర్ వీరప్పన్ చేతిలో కిడ్నాప్ కాబడి దాదాపు రెండు నెలలపాటు అడవుల్లో తిరుగుతూ కూడా మనోధైర్యాన్ని కోల్పోని రియల్ హీరో.. కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ గారు. ఆ కథ చెప్పిన దర్శకుడు మొదటి చిత్రం బద్రి తో ఇండస్ట్రీ హిట్ ఇచ్చి, రెండో చిత్రం జగపతిబాబుతో బాచి అనే ప్లాప్ చిత్రం అందించిన దర్శకుడు పూరి జగన్నాథ్.
ఆ రోజు రాజ్ కుమార్ గారికి చెప్పిన కథతోనే రవితేజ హీరోగా తెలుగులో తెరకెక్కించగా విడుదలై సూపర్ హిట్ అయిన సినిమా ఇడియట్. ఇడియట్ మొదట కన్నడంలో రాజ్ కుమార్ గారి తనయుడు పుతిన్ రాజ్ కుమార్ హీరోగా అప్పు అనే చిత్రం గా తెరకెక్కి ఏప్రిల్ నెలలో విడుదలైంది. తర్వాత తెలుగులో ఆగస్టు నెలలో రిలీజ్ అయింది.
రెండు చిత్రాలకు దర్శకుడు పూరి జగన్నాధే.. హీరోయిన్ గా కన్నడంలో నటించిన రక్షితనే తెలుగులో కూడా తీసుకున్నారు. అప్పు చిత్రం ముగింపు దశలో ఉండగా మార్చి నెలలో ఇడియట్ చిత్రం చిత్రీకరణ ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి మెగాస్టార్ చిరంజీవి క్లాప్ కొట్టారు. చిరంజీవి పుట్టినరోజు ఆగస్టు 22వ తేదీన సినిమా విడుదలై ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
ఈ సినిమాలో ఇంకో విశేషం ఏంటంటే హీరోని చిరంజీవి అబిమానిగా చూపించడం, చిరంజీవి గారి ఇంద్ర సినిమా ప్రస్తావన మరియు కటౌట్ సినిమాలో కనిపించడం. గబ్బర్ సింగ్ సినిమాలో చెప్పినట్లుగా కంటెంట్ ఉన్నోడి కటౌట్ చాలు. అలానే, చిరంజీవి సినిమాలో కనిపించనవసరం లేదు. ఆయన కటౌట్ ఉంటే చాలు.. సినిమా సూపర్ హిట్ అవుతుంది అని నిరూపించిన చిత్రం ఇడియట్.