Ajith Kumar: ‘కరూర్ విషాదానికి విజయ్‌తో పాటు అందరూ బాధ్యులే’.. సూపర్‌స్టార్ అజిత్ షాకింగ్ కామెంట్స్
Ajith Kumar: తమిళనాడులోని కరూర్‌లో దళపతి విజయ్ నిర్వహించిన ర్యాలీలో చోటుచేసుకున్న ఘోరమైన తొక్కిసలాట సంఘటనపై సూపర్‌స్టార్ అజిత్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సెప్టెంబర్ 27న జరిగిన ఈ విషాదంలో 41 మంది మృతి చెందగా, 60 మందికి పైగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు కేవలం విజయ్‌ను మాత్రమే నిందించడం సరికాదని, ప్రతి ఒక్కరూ ఆత్మపరిశీలన చేసుకొని బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని అజిత్ స్పష్టం చేశారు.
తాజాగా ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అజిత్ ఈ విషయంపై మాట్లాడారు. కరూర్ లాంటి సామూహిక రాజకీయ కార్యకలాపాలను పూర్తిగా నివారించాలని ఆయన పిలుపునిచ్చారు. “ఏ ఒక్క వ్యక్తి వల్ల ఈ ప్రమాదం జరిగిందని నేను అనడం లేదు. కానీ, ఆ రోజు జరిగిన ఘటన తమిళనాట అనేక విషయాలను మార్చేసింది” అని అజిత్ పేర్కొన్నారు.
అజిత్ మాట్లాడుతూ, ఈ దురదృష్టకర సంఘటనకు విజయ్‌తో పాటు మనందరి తప్పు కూడా ఉందని, అందరం బాధ్యత తీసుకోవాలని అన్నారు. “క్రికెట్ మ్యాచ్ చూడడానికి వేలాది మంది వెళ్తారు. వారు సురక్షితంగా ఇంటికి తిరిగి వస్తారు కదా. మరి సినీ స్టార్స్‌తో ముడిపడిన సభల్లో ఇలాంటి ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి?” అని ప్రశ్నించారు. ఈ విషయంలో మీడియా కూడా మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటువంటి విషాదకర సంఘటనలు పదేపదే జరగడం వల్ల చలనచిత్ర పరిశ్రమపై చెడ్డపేరు వస్తుందని అజిత్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అజిత్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, కొత్త చర్చకు దారితీశాయి.
ఈ తొక్కిసలాట ఘటన జరిగిన వెంటనే దళపతి విజయ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు తాను అండగా ఉంటానని ప్రకటించి, మృతుల కుటుంబాలకు రూ. 20 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 2 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. అంతేకాక, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఇటీవల, విజయ్ స్వయంగా బాధిత కుటుంబాలను కలుసుకుని వారికి మానసిక మద్దతు, సానుభూతిని వ్యక్తం చేశారు.
ఈ తొక్కిసలాట ఘటనపై విమర్శలు కొనసాగుతున్న నేపథ్యంలో, సూపర్‌స్టార్ అజిత్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీ, అభిమానులు, రాజకీయ వర్గాల్లో మరింత ఆత్మపరిశీలనకు దారి తీస్తాయనడంలో సందేహం లేదు.
