Aishwarya Rai: డీప్‌ఫేక్‌ల కేసులో ఐశ్వర్యరాయ్ రూ.4 కోట్ల దావా.. 250 వీడియోలు తొలగించిన యూట్యూబ్
Aishwarya Rai: కృత్రిమ మేధస్సు (AI) సాంకేతికత విస్తరిస్తున్న తరుణంలో, సెలబ్రిటీల వ్యక్తిత్వ హక్కుల ఉల్లంఘన సమస్యలు తీవ్రమవుతున్నాయి. తాజాగా, ఈ విషయంలో బాలీవుడ్ అగ్ర జంట ఐశ్వర్య రాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ చేసిన న్యాయ పోరాటానికి ఎట్టకేలకు ఫలితం దక్కింది. తమ అనుమతి లేకుండా, AI డీప్‌ఫేక్ సాంకేతికతను ఉపయోగించి తమ ఫోటోలు, వీడియోలను యూట్యూబ్‌లో ప్రసారం చేస్తున్నారని ఆరోపిస్తూ ఈ జంట మొదట ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.
కోర్టు వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చినా, యూట్యూబ్ ఆ కంటెంట్‌ను తొలగించడంలో జాప్యం చేయడంతో బచ్చన్ దంపతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రూ. 4 కోట్ల పరువు నష్టం దావా
సమస్య తీవ్రత దృష్ట్యా, ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ ఒక అడుగు ముందుకేసి, యూట్యూబ్, దాని మాతృసంస్థ గూగుల్‌పై ఏకంగా రూ. 4 కోట్లకు భారీ పరువు నష్టం దావా వేశారు. ఈ దావాతో యూట్యూబ్ సంస్థ వెంటనే అప్రమత్తమైంది. తక్షణమే చర్యలు చేపట్టి, సుమారు 250కి పైగా వీడియో లింక్‌లను యుద్ధ ప్రాతిపదికన తొలగించింది. అంతేకాకుండా, అటువంటి కంటెంట్‌ను ప్రసారం చేస్తున్న ఛానల్స్‌ను కూడా బ్లాక్ చేసింది.
ఐశ్వర్య రాయ్ గౌరవానికి భంగం కలిగించేలా ఉన్న యూఆర్‌ఎల్‌లను వెంటనే తొలగించి, బ్లాక్ చేయాలని ఢిల్లీ హైకోర్టు ఈ కేసులో గూగుల్, యూట్యూబ్‌తో సహా అన్ని ప్లాట్‌ఫార్మ్‌లకు నోటీసులు జారీ చేసింది. న్యాయస్థానం కఠినంగా హెచ్చరిస్తూ, 72 గంటల్లోపు ఆ కంటెంట్ కనిపించకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే యూట్యూబ్, గూగుల్ వేగంగా స్పందించాయి.
ఇటీవల కాలంలో, టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జున కూడా తన పేరు, ఫోటోలను అనుమతి లేకుండా వాణిజ్య ప్రకటనలకు వాడుతున్నారని ఫిర్యాదు చేసి, న్యాయస్థానం నుంచి ఉత్తర్వులు పొందారు. సెలబ్రిటీల వ్యక్తిగత హక్కుల పరిరక్షణ విషయంలో ఐశ్వర్య రాయ్ – అభిషేక్ బచ్చన్ కేసు ఒక కీలకమైన మైలురాయిగా నిలిచింది.
