Allari Naresh: పాములకు భయపడి సూపర్ హిట్ చిత్రాన్ని వదులుకున్న నరేశ్.. అది ఏ మూవీ అంటే?
Allari Naresh: తెలుగు సినిమా పరిశ్రమలో మిస్టరీ థ్రిల్లర్ జానర్‌లో ఒక కొత్త ఒరవడిని సృష్టించిన చిత్రం ‘కార్తికేయ’. ఈ సినిమా హీరో నిఖిల్ సిద్ధార్థ్ కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలిచింది. కేవలం రూ. 6 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమైన ఈ సినిమా అప్పట్లో దాదాపు రూ. 20 కోట్ల భారీ వసూళ్లను సాధించింది. అయితే, ఈ బ్లాక్‌బస్టర్ సినిమా వెనుక ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.
ఈ సినిమా కథను దర్శకుడు చందూ మొండేటి మొదటగా టాలీవుడ్‌లో కామెడీ హీరోగా పేరున్న అల్లరి నరేష్‌కు వినిపించారట. కథ నరేష్‌కు ఎంతగానో నచ్చినా, ఒకే ఒక్క బలమైన కారణం చేత ఆయన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును తిరస్కరించాల్సి వచ్చింది. ఆ కారణం ఏంటంటే… పాముల భయం!
సుబ్రహ్మణ్యపురం అనే గ్రామంలోని సుబ్రహ్మణ్యస్వామి దేవాలయం నేపథ్యంలో అద్భుతంగా రూపొందిన ఈ చిత్రంలో పాములకు సంబంధించిన సన్నివేశాలు కీలక పాత్ర పోషించాయి. కథాగమనంలో ఆ దృశ్యాలే ప్రధానం. కానీ, తనకు పాములంటే వ్యక్తిగతంగా తీవ్ర భయం ఉండటం వల్ల, ఆ సన్నివేశాల్లో నటించలేననే ఉద్దేశంతో నరేష్ ఈ అవకాశాన్ని వదులుకున్నానని ఒక ఇంటర్వ్యూలో స్వయంగా పంచుకున్నారు. షూటింగ్‌లో మాత్రమే కాదు, తెరపై పాములను చూసినా ఇప్పటికీ భయపడతానని ఆయన వెల్లడించారు.
ఒకవేళ అల్లరి నరేష్ ‘కార్తికేయ’ (2014)లో నటించి ఉంటే, అప్పుడే ఆయన సీరియస్ కథల వైపు అడుగులు వేసే అవకాశం దక్కి ఉండేది. అయితే, ఈ విషయంపై నరేష్‌కు గతంలో కొంత సందేహం ఉండేదట. కామెడీ పాత్రల్లోనే ఎక్కువగా చూసిన ప్రేక్షకులు, సీరియస్ లుక్‌లో తనను స్వీకరిస్తారా లేదా అనే ఆలోచన ఉండేదని తెలిపారు. ఈ సందేహానికి మహేష్ బాబు హీరోగా నటించిన ‘మహర్షి’ చిత్రంలో ఆయన పోషించిన రవిశంకర్ పాత్ర సమాధానంగా నిలిచింది. ఆ పాత్ర ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన పొందడంతో, పవర్‌ఫుల్, సీరియస్ కథల్లో నటించేందుకు తనకు ధైర్యం వచ్చిందని నరేష్ వెల్లడించారు.
‘కార్తికేయ’ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. దీనికి సీక్వెల్‌గా వచ్చిన ‘కార్తికేయ 2’ ఏకంగా జాతీయ స్థాయిలో గుర్తింపును, సంచలన విజయాన్ని నిఖిల్‌కు అందించింది. ఏదేమైనా, ఒక నటుడి వ్యక్తిగత భయం కారణంగా ఇంతటి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌ను కోల్పోవడం సినీ వర్గాలలో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.
