AR Rahman: ఓపెన్ ఏఐ సీఈవోను కలిసిన ఏ.ఆర్ రెహమాన్..
AR Rahman: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఓపెన్‌ఏఐ (OpenAI) సీఈఓ సామ్ ఆల్ట్‌మన్‌ను కలిశారు. తన ప్రాజెక్ట్ ‘సీక్రెట్ మౌంటైన్’ గురించి చర్చించేందుకు రెహమాన్ ఆల్ట్‌మన్‌ను కలిసినట్లు ఏ.ఆర్ రెహమాన్ తెలిపారు.
“సామ్ ఆల్ట్‌మన్‌ను ఆయన కార్యాలయంలో కలవడం చాలా ఆనందంగా ఉంది. మా వర్చువల్ గ్లోబల్ బ్యాండ్ ‘సీక్రెట్ మౌంటైన్’ గురించి చర్చించాం. ఏఐ టూల్స్‌ను ఉపయోగించి భారతీయ మేధస్సును ప్రోత్సహించడం, భవిష్యత్ సవాళ్లను ఎదుర్కోవడానికి ఏఐ ఎలా సహాయపడుతుందనే అంశాలపై మాట్లాడాం” అని రెహమాన్ తన ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆల్ట్‌మన్‌తో దిగిన ఫోటోను కూడా ఆయన షేర్ చేశారు. ఓపెన్ ఏఐ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ నారాయణన్ కూడా ఈ భేటీపై స్పందిస్తూ, రెహమాన్‌కు తమ కార్యాలయంలో ఆతిథ్యం ఇవ్వడం గౌరవంగా ఉందని, ఆయన కేవలం గొప్ప సంగీతకారుడు మాత్రమే కాకుండా నిజమైన ఆవిష్కర్త అని కొనియాడారు.
ఏంటీ.. ‘సీక్రెట్ మౌంటైన్’?
‘సీక్రెట్ మౌంటైన్’ అనేది ఏఆర్ రెహమాన్ కలల ప్రాజెక్ట్. ఇది ఒక డిజిటల్, మల్టీమీడియా మరియు “మెటా బ్యాండ్” కాన్సెప్ట్‌తో కూడిన వర్చువల్ మ్యూజికల్ యూనివర్స్. ఇది సంగీతం, సాంకేతికతతో కలగలిసి ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కళాకారులను ఒకే వేదికపైకి తీసుకురావాలని రెహమాన్ లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఏఐపై రెహమాన్ దృక్పథం
సంగీత రంగంలో ఏఐ చేస్తున్న అద్భుతాలపై గతంలో రెహమాన్ స్పందించారు. ఏఐలో మంచి, చెడు రెండూ ఉన్నాయని ఆయన అన్నారు. చనిపోయిన గాయకుల వాయిస్‌లను ఉపయోగించి పాటలను పాడించడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే వారు పాడని పాటలను కూడా వారి వాయిస్‌తో పాడినట్లు సృష్టించడాన్ని కూడా ఆయన తప్పు పట్టారు. ఏఐ వాడకానికి కొన్ని పరిమితులు ఉండాలని రెహమాన్ సూచించారు. అయితే రెహమాన్ తన ‘లాల్ సలామ్’ చిత్రంలో దివంగత గాయకులు బంబా బక్యా మరియు షాహుల్ హమీద్‌ల గాత్రాన్ని ఏఐ సహాయంతో పునఃసృష్టించడం విమర్శలకు దారితీసిన విషయం తెలిసిందే.
సామ్ ఆల్ట్‌మన్‌తో పాటు, రెహమాన్ పెర్‌ప్లెక్సిటీ సీఈఓ అరవింద్ శ్రీనివాస్‌ను కూడా కలిశారు, అక్కడ కూడా ‘సీక్రెట్ మౌంటైన్’ గురించి చర్చించారు.
