Arjun Chakravarthy: సినిమా విడుదలకు ముందే 46 అంతర్జాతీయ అవార్డులు.. !
Arjun Chakravarthy: కబడ్డీ నేపథ్యంలో సాగే ‘అర్జున్ చక్రవర్తి’ సినిమా టీజర్ విడుదలైంది. ఇప్పటికే 46 అంతర్జాతీయ ఫిల్మ్ అవార్డులు గెలుచుకుని సినీ ప్రపంచంలో సంచలనం సృష్టించిన ఈ సినిమా టీజర్‌ను ప్రముఖ దర్శకుడు హను రాఘవపూడి ఆవిష్కరించారు. విజయరామరాజు టైటిల్ రోల్ పోషించిన ఈ స్పోర్ట్స్ డ్రామాకు విక్రాంత్ రుద్ర దర్శకత్వం వహించగా, శ్రీని గుబ్బల నిర్మించారు. ఈ టీజర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది.
ఒక కబడ్డీ ప్లేయర్ ఎమోషనల్ జర్నీ’అర్జున్ చక్రవర్తి’. 1980లలో కబడ్డీ ఆడిన అర్జున్ జీవితంలో చోటుచేసుకున్న అనూహ్య సంఘటనలను ఆవిష్కరించింది ఈ టీజర్. ఒక ఛాంపియన్ కబడ్డీ ఆటగాడి జీవితం ఎలా తలకిందులైంది, అతను కబడ్డీకి ఎందుకు దూరమయ్యాడు, తిరిగి ఎలా కోర్టులోకి అడుగుపెట్టాడు అనే అంశాలను టీజర్ ఆసక్తికరంగా చూపించింది.
విజయ రామరాజు కబడ్డీ ఆటగాడు అర్జున్ చక్రవర్తి పాత్రలో ఒదిగిపోయారు. ఆయన బాడీ లాంగ్వేజ్, ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ సినిమా కోసం ఆయన పడిన కష్టాన్ని స్పష్టం చేస్తున్నాయి. సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం కూడా టీజర్‌కు అదనపు ఆకర్షణగా నిలిచాయి. “అవకాశం బలవంతుడిని చేస్తే, అవసరం బలహీనుడిని చేస్తుంది”, “ప్రతీసారి ఎదుటివాడి ఓటమే మన గెలుపుకాదు.. ఓడిపోయాననే ఆలోచనే నీ ఓటమి అవుతుంది.. ముందు ఆలోచనలని గెలవాలి” వంటి డైలాగ్స్ సినిమాలోని బలమైన కంటెంట్‌ను తెలియజేస్తున్నాయి.
ఏడాదిన్నర పాటు ప్రో కబడ్డీ టీమ్స్‌తో కలిసి ప్రయాణించి, నిజంగా ఆటను నేర్చుకుని ఈ సినిమా చేసినట్లు హీరో విజయరామరాజు తెలిపారు. ఇదంతా మా దర్శకుడు, నిర్మాత మద్దతుతోనే సాధ్యమైనట్లు వెల్లడించారు. దర్శకుడు విక్రాంత్ రుద్ర అద్భుతంగా రాణించారని, సినిమా క్రెడిట్ అంతా ఆయనకే దక్కుతుందన్నారు.
46 అవార్డులు..!
విడుదలకు ముందే 14 అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమైన ఈ చిత్రం 46 అవార్డులు గెలుచుకోవడం ప్రత్యేకత. ఇది బలమైన కథ, అద్భుతమైన నిర్మాణ విలువలకు నిదర్శనం. త్వరలోనే ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
