Avika Gor: డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతావా.. అవికా గోర్ రియాల్టీ షో పెళ్లిపై ట్రోల్స్.. ఘాటుగా స్పందించిన నటి
Avika Gor: ‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్ ద్వారా దేశవ్యాప్తంగా విశేష గుర్తింపు తెచ్చుకున్న నటి అవికా గోర్ ఇటీవల తన ప్రియుడు మిళింద్ చద్వానీని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈ జంట ఒక ప్రముఖ హిందీ టీవీ రియాలిటీ షో వేదికగా పెళ్లి చేసుకోవడంతో పెద్ద ఎత్తున విమర్శలు, ట్రోల్స్‌ను ఎదుర్కొన్నారు. తాజాగా దీనిపై అవికా, మిళింద్ తీవ్రంగా స్పందించారు. డబ్బు కోసమే ఇలా చేశారంటూ వచ్చిన ఆరోపణలను ఈ జంట ఖండించింది.
టీవీ కార్యక్రమంలో పెళ్లి చేసుకోవాలనేది తనకు చిన్ననాటి కోరిక అని, తన నిర్ణయాన్ని మిళింద్‌కు చెప్పినప్పుడు అతను వెంటనే అంగీకరించాడని అవికా గోర్ తెలిపారు. ఈ నిర్ణయంపై ప్రజల నుంచి విమర్శలు వస్తాయని, ‘డబ్బు కోసం’ ఇలా చేస్తున్నారని ఆరోపణలు రావచ్చని మిళింద్ ముందే చెప్పాడని ఆమె గుర్తు చేసుకున్నారు. “ప్రజల గురించి నేను పట్టించుకోను. మా నిర్ణయంపై మేమిద్దరం సంతోషంగా ఉన్నాం. మిళింద్ అంగీకరించడమే నాకు ముఖ్యం,” అని అవికా ధీమాగా చెప్పారు.
అంతేకాకుండా, సంప్రదాయబద్ధంగా జరిగిన తన వెడ్డింగ్ లుక్‌పై కూడా నెట్టింట ట్రోల్స్ వచ్చాయని అవికా పేర్కొన్నారు. “నా లుక్‌పై వచ్చిన ట్రోల్స్‌ను నేను పెద్దగా పట్టించుకోను. ఒకవేళ ఈ ట్రోల్స్ నా భర్త లుక్స్ గురించి వచ్చి ఉంటే నేను కచ్చితంగా బాధపడేదాన్ని. ఎందుకంటే, ఆయన లుక్‌ను నేను ప్రత్యేకంగా డిజైన్ చేశాను. అలా జరగనందుకు నాకు సంతోషంగా ఉంది,” అని ఆమె సరదాగా వ్యాఖ్యానించారు.
మరోవైపు, టీవీ షోలో పెళ్లి చేసుకోవడంపై వచ్చిన విమర్శలకు అవికా భర్త మిళింద్ చద్వానీ గట్టి సమాధానం ఇచ్చారు. ఈ రోజుల్లో కనీసం 50 మంది ఫొటోగ్రాఫర్లు, వీడియో రికార్డ్ చేసేవారు లేకుండా ఏ వివాహమూ జరగడం లేదని ఆయన అన్నారు. అందరి పెళ్లిళ్లలో ఇలాంటి ప్రచారం సాధారణమేనని, అవికా మంచి ఉద్దేశంతోనే రియాలిటీ షో వేదికగా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుందని తెలిపారు. సెప్టెంబర్ 30న ఈ జంట హిందీ రియాలిటీ షోలో వివాహ బంధంతో ఒక్కటైంది.
https://www.instagram.com/reel/DPynxlSk1yT/?utm_source=ig_embed&ig_rid=d3b37867-59f5-41c6-916e-0cb0ec94b6af
